మోదీ ‘టైమ్‌’ మారింది

30 May, 2019 04:40 IST|Sakshi

రెండు వారాల్లోనే మోదీపై యూటర్న్‌ తీసుకున్న టైమ్‌ మేగజీన్‌

5 దశాబ్దాల్లో మోదీలా దేశాన్ని ఎవ్వరూ ఏకం చేయలేదని ప్రశంస

న్యూయార్క్‌: ప్రధాని మోదీ భారత విభజన సారథి (ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌) అంటూ ఆయనను విమర్శిస్తూ రెండు వారాల క్రితం (సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు) కథనం ప్రచురించిన ప్రముఖ టైమ్‌ మేగజీన్‌.. ఎన్నికల ఫలితాలు రాగానే మాట మార్చింది. గత 5 దశాబ్దాల్లో మోదీలా దేశాన్ని ఎవ్వరూ ఏకం చేయలేకపోయారంటూ మోదీని ప్రశంసిస్తూ తాజాగా మరో కథనాన్ని ప్రచురించింది. పాత కథనాన్ని పాకిస్తాన్‌ మూలాలున్న ఆతీష్‌ తసీర్‌ అనే జర్నలిస్టు రాయగా, తాజా కథనాన్ని భారత్‌కు చెందిన మనోజ్‌ లాద్వా రాశారు.

లండన్‌ కేంద్రంగా పనిచేసే ఇండియా ఇన్‌కార్పొరేషన్‌ గ్రూప్‌ అనే మీడియా సంస్థ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవోనే ఈ మనోజ్‌. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ‘ప్రధానిగా మోదీ’ అనే ప్రచార కార్యక్రమంలో పరిశోధన, విశ్లేషణ విభాగానికి మనోజ్‌ నేతృత్వం వహించారు. మోదీ సమాజంలో మతపరమైన విభజన తీసుకువచ్చారని ఆతీష్‌ తసీర్‌ వ్యాసం ద్వారా ఆరోపించిన టైమ్‌ మేగజీన్‌.. ఎన్నికల్లో మోదీ భారీ విజయం సాధించడంతో ఆ పత్రిక తన రూటు మార్చుకోవాల్సి వచ్చింది. మోదీ విభజన వాది కాదు, దేశాన్ని ఏకతాటిపైన నడిపించిన నాయకుడు అంటూ మనోజ్‌ రాసిన సంపాదకీయంలో టైమ్‌ ప్రశంసించింది. కుల, మత, వర్గ సమీకరణల్ని అధిగమించి మరీ మోదీ అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాదు, సీట్లు, ఓట్లు పెంచుకున్నారని విశ్లేషించింది.

క్షేత్రస్థాయి అధ్యయనంలో విదేశీ మీడియా విఫలం
భారత్‌లో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అధ్యయనం చేయడంలో పశ్చిమ దేశాల మీడియా విఫలమైందని మనోజ్‌ అభిప్రాయపడ్డారు. ‘మోదీ అధికారంలోకి వచ్చాక అగ్రకులాల ఆధిపత్యం పెరిగిందని అందరూ భావించారు. వెనుకబాటు కులాలే ఒక్కటై మోదీకి జేజేలు పలికాయి. ఒక వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం, ఉద్యోగ వర్గాలకు ప్రతి«నిధిగా ఆయన కనిపించడం, నిరుపేదలు అత్యధికంగా ఉన్న భారత్‌లో మోదీపై ఉన్న వ్యక్తిగత కరీష్మాయే ఆయనను రెండోసారి అధికార అందలాన్ని ఎక్కించింది. పాలనలో మోదీ విధానాలపై ఎన్నో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్నికల ప్రచారం సమయంలోనూ ఆయనను విపక్ష పార్టీలు విమర్శించాయి. అయినా భారత ఓటర్లు ఏకమై ఆయనకే పట్టంగట్టారు. ఈ స్థాయిలో ఓటర్లు ఒక్కటై ఒక వ్యక్తిని చూసి ఓటు వేయడం 50 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి’ అని మేగజీన్‌ వ్యాసంలో పేర్కొంది.

మరిన్ని వార్తలు