27న మోదీ, జిన్‌పింగ్‌ భేటీ

23 Apr, 2018 02:06 IST|Sakshi

చైనా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ

జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకే: చైనా విదేశాంగ మంత్రి

బలమైన బంధానికి సరిహద్దులో శాంతి తప్పనిసరి: సుష్మ

బీజింగ్‌: చైనాతో సుహృద్భావ సంబంధాల దిశగా మరో అడుగు పడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య భేటీకి ముహూర్తం కుదిరింది. ఈ నెల 27, 28 తేదీల్లో వారిరువురు సమావేశం కానున్నారు. చైనాలోని హుబీ ప్రావిన్సులోని వుహన్‌ నగరంలో ఈ అనధికార శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ భేటీలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వివాదాస్పద అంశాల పరిష్కారం, అంతర్జాతీయ సమస్యలు.. తదితర అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

రెండు దేశాలకు దీర్ఘకాలిక, వ్యూహాత్మక ప్రయోజనాలకు వీలు కల్పించే దిశగా చర్చలు కొనసాగనున్నాయి. అయితే, ఈ సందర్భంగా ఎలాంటి ప్రతినిధుల స్థాయి చర్చలుండబోవని, ఎలాంటి ఒప్పందాలు కుదరబోవని, కేవలం ఇద్దరు నేతలు ఏకాంతంగా చర్చలు జరుపుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  డోక్లాం సహా పలు సరిహద్దు వివాదాలు,  ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వాన్ని చైనా అడ్డుకోవడం, ఉగ్రవాది మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో చైనా మోకాలడ్డడం తదితర అంశాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు మోదీ చైనా పర్యటనకు వస్తున్నారని భారత్, చైనాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్, వాంగ్‌ యి ఆదివారం సంయుక్తంగా  ప్రకటించారు. ‘భారత్, చైనాల మధ్య విబేధాల కన్నా ప్రయోజనాలే ముఖ్యమైనవి. పరస్పర ప్రయోజనపూరిత అభివృద్ధికి రెండు దేశాల మధ్య సహకారం అవసరం’ అని వాంగ్‌ యి పేర్కొన్నారు.  మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య భేటీ ఏర్పాట్లపై వాంగ్‌ యితో చర్చించినట్లు సుష్మాస్వరాజ్‌ తెలిపారు.  షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు ప్రస్తుతం సుష్మ చైనాలో పర్యటిస్తున్నారు. జూన్‌ 9, 10 తేదీల్లోనూ ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు మోదీ చైనా వెళ్తారు.

మానస సరోవర యాత్రకు చైనా ఓకే
వాంగ్‌ యితో భేటీ అనంతరం సుష్మ మాట్లాడుతూ సిక్కింలోని నాథూ లా కనుమ మార్గంలో కైలాశ్‌ మానస సరోవర యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందన్నారు. డోక్లాం వివాదం తర్వాత నాథూ లా మార్గం గుండా మానస సరోవర యాత్రను నిలిపివేయడం తెలిసిందే.

                  చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యితో సుష్మ కరచాలనం

మరిన్ని వార్తలు