ఉగ్రవాదాన్ని ఖండించాల్సిందే! 

30 Oct, 2019 01:00 IST|Sakshi
కింగ్‌ సల్మాన్‌తో కరచాలనం చేస్తున్న భారత ప్రధాని మోదీ

భారత్, సౌదీ ఉమ్మడి ప్రతిన

సౌదీ రాజు సల్మాన్‌తో మోదీ భేటీ

సౌదీ అరేబియాతో భారత్‌ స్ట్రాటెజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ కౌన్సిల్‌ ఒప్పందం

రియాధ్‌: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందేనని భారత్, సౌదీ అరేబియాలు స్పష్టం చేశాయి. సోమవారం రాత్రి రియాధ్‌ చేరుకున్న మోదీ.. మంగళవారం సౌదీ  సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌తో పాటు ప్రభుత్వంలోని విద్యుత్, ఇంధన, కార్మిక, వ్యవసాయ, జల నిర్వహణ.. తదితర శాఖల మంత్రులతో సమావేశమై చర్చలు జరిపారు. సౌదీ రాజు సల్మాన్‌తో ప్రధాని మోదీ భేటీ అనంతరం ఆ వివరాలను భారత విదేశాంగ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి టీఎస్‌ తిరుమూర్తి మీడియాకు వెల్లడించారు. ఆయిల్‌ అండ్‌ గ్యాస్, తీర ప్రాంత భద్రత, టెక్నాలజీ, వాణిజ్యం, పెట్టుబడులు తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయని తెలిపారు. మోదీ పర్యటన సందర్భంగా.. ఆ రంగాలతో పాటు డ్రగ్స్‌ రవాణా నియంత్రణ, వైమానిక సేవల సంబంధ ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయన్నారు.

రెండు దేశాలదీ ఒకే సమస్య 
ఉగ్రవాదంపై పోరు సహా భద్రతకు సంబంధించిన అంశాల్లో భారత్, సౌదీ అరేబియాల మధ్య సహకారం విజయవంతంగా ముందుకు సాగుతోందని స్థానిక పత్రిక ‘అరబ్‌ న్యూస్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పేర్కొన్నారు. పొరుగు దేశాల కారణంగా రెండు దేశాలు ఒకేరకమైన భద్రతాపరమైన సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. ‘ఆసియా దేశాల్లో సౌదీ అరేబియా, భారత్‌లు తమ పొరుగు దేశాల నుంచి ఒకే రకమైన భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి’ అని మోదీ ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. వ్యూహాత్మక భాగస్వామ్య మండలికి సంబంధించి ఒప్పందం కుదరడంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయన్నారు. సౌదీ అరేబియాతో ద్వైపాక్షిక సంబంధాలకు భారత్‌ అత్యంత ప్రాముఖ్యతనిస్తుందన్నారు. 2016లో తన పర్యటన సహా ఇరుదేశాల నేతల పర్యటనలతో బంధం మరింత దృఢమైందన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా