ఇమ్రాన్‌ ఖాన్‌కు మోదీ ధన్యవాదాలు!

9 Nov, 2019 14:49 IST|Sakshi

చండీగఢ్‌ : సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా శనివారం పంజాబ్‌లోని దేరా బాబా నానక్‌ మందిరంలో  ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సిక్కుల చిరకాల స్వప్నమైన కర్తార్‌పూర్‌ దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారా దర్శనానికి వీలు కల్పించిన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారత్‌ నుంచి పాకిస్తాన్‌ దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాకు నేరుగా వెళ్లేందుకు వీలుకల్పించే కర్తార్‌పూర్‌ కారిడార్‌కు.. పంజాబ్‌ సరిహద్దులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను(ఐసీపీ) మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయుల మనోభావాలను గౌరవించి.. రెండు దేశాల మధ్య కర్తార్‌పూర్‌ కారిడార్‌ను అనుమతించిన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. 

అదే విధంగా సిక్కు మతంలో కర్తార్‌పూర్‌కు ఉన్న ప్రాశస్త్యం గురించి మాట్లాడుతూ.. గురునానక్‌ ఇక్కడి నుంచే ' నిజాయితీగా పని చేయండి. దేవుణ్ణి స్మరించండి. పంచండి' అనే సందేశమిచ్చారనే విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఐక్యత, సామాజిక సామరస్యం, సోదర భావం దిశగా గురు నానక్ చేసిన బోధనలు ఒక్క సిక్కు వర్గానికి మాత్రమే పరిమితం కాదని.. సమస్త మానవాళికి హితోపదేశమని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు