పాక్‌ టెర్రరిజం.. ఓ అనవసరమైన చర్చ

1 Sep, 2017 09:08 IST|Sakshi
పాక్‌ టెర్రరిజం.. ఓ అనవసరమైన చర్చ
సాక్షి, బీజింగ్‌: ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్‌ స్వర్గధామంగా మారిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సమావేశం సందర్భంగా ప్రత్యేకంగా భేటీ కానున్న మోదీ-జిన్‌పింగ్‌ల మధ్య ఈ అంశం ప్రస్తావనకు వస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే అదసలు ఓ అనవసరమైన అంశమంటూ డ్రాగన్ కంట్రీ తేల్చేసింది.
 
‘పాక్‌ ఉగ్ర కార్యకలాపాలపై భారత్‌ అసంతృప్తితో ఉందనే విషయం మా దృష్టిలోకి వచ్చింది. అయితే పాకిస్థాన్‌ టెర్రరిజం కౌంటర్‌ రికార్డ్‌ అన్నది ఓ అనవసరమైన అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునియింగ్‌ తెలిపారు. ఆ మాటకొస్తే ఉగ్రపంజాకు బలవుతున్న దేశాల్లో పాకిస్థాన్‌ కూడా ఒకటని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు పాక్‌ ఎప్పుడూ ముందుంటుందని, ఆ విషయం ప్రపంచదేశాలన్నీ కూడా గుర్తించాయని ఆయన తెలిపారు.
 
పాక్‌ తోనే కాదు.. మిగతా దేశాలతో కూడా మేం మైత్రిని కొనసాగిస్తూనే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడతాం అని ఈ సందర్భంగా హువా చునియింగ్‌ చెప్పుకొచ్చారు. అయితే మోదీ-జింగ్‌పింగ్‌ భేటీలో ద్వైపాక్షిక చర్చలు ఉంటాయా? అన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు. ట్రంప్‌ ఆరోపణల అనంతరం పాక్‌కు మద్ధతు తెలుపుతూ చైనా ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రచర్యలను అణించేందుకు పాక్‌ చూపిన చొరవను అమెరికా అప్పుడే మరిచిపోయిందంటూ చైనా విదేశాంగ శాఖ సదరు ప్రకటనలో పేర్కొంది.

 

>
మరిన్ని వార్తలు