నిజంచెప్పిన అమ్మ.. పిల్లలు షాక్

19 Jun, 2016 08:45 IST|Sakshi
నిజంచెప్పిన అమ్మ.. పిల్లలు షాక్

న్యూయార్క్: ఆమె బయటకు చెప్పుకోలేని ఉద్యోగం చేస్తుంది. పని గర్వంతో నిండినదేగానీ.. బయటకు చెప్పితే ప్రమాదం. శత్రువులు వారి కుటుంబంపై దాడి చేస్తారని, పిల్లలను ఎత్తుకెళతారని. భర్తకు మాత్రం తెలుసు. పిల్లలకు ఆ విషయం తెలియదు. తాను ఇలాగే చెప్పకుండా ఉంటే పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అని తల్లి మనసు ఒకటే కొట్టుకుంటుంది. ఒక రోజు తన స్నేహితురాలి సలహాను కూడా అడిగింది. దాంతో ఆలస్యం చేస్తే పిల్లలు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందనే, చివరకు అసలు నమ్మకమే కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించింది.

దీంతో ఇక ఎలాగైనా ఆరోజు తన పిల్లలకు నిజం చెప్పాలని నిర్ణయించుకుని చెప్పేసింది. దాంతో ఆ పిల్లలు షాక్ అయ్యారు. అప్పటి వరకు ఓ సాధారణ మహిళగానే గుర్తించిన ఆమె గురించి అనూహ్య విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. వావ్ అంటూ మురిసి పోయారు. ఇంతకు ఆ పిల్లలు వావ్ అనుకునేలా ఆ తల్లి చేస్తున్న పని ఏమిటో తెలుసా.. స్పై.. గుఢాచారి ఉద్యోగం. అది కూడా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలోని సీఐఏలో. సీఐఏలో ఉద్యోగం అంటే సాధాసీదా ఉద్యోగం కాదు.

అది కూడా స్పై ఉద్యోగం అంటే ఇంక చెప్పలేము. ఎన్నో ఏళ్లుగా దాచిపెట్టుకున్న ఈ నిజాన్ని తన పిల్లలకు చెప్పిన ఆ తల్లి పేరు మార్థా పీటర్సన్. ఆమె సీఐఏలో గుఢాచారిగా ఉద్యోగం చేస్తుంది. అయితే, తన ఉద్యోగం గురించి పిల్లలకు చెబితే వారు అక్కడాఇక్కడ చెప్పి శత్రువుల బారిన పడతారో అనే భయంతో, బెంగతో దాదాపు పదిహేడేళ్లపాటు ఆ నిజం చెప్పకుండా తనలోనే దాచుకుంది. టైలర్ (17), లోరా (15) అనే తన పిల్లలిద్దరిని ఓ గుడ్ ఫ్రైడే రోజున కారులో ఎక్కించుకొని తీసుకెళుతూ సడెన్గా తాను ఒక స్పైనని, సీఐఏలో పనిచేస్తుంటానని చెప్పింది.

దీంతో ఆ పిల్లలిద్దరు అవాక్కయ్యారు. అంతపెద్ద ఉద్యోగం చేస్తూ ఇన్ని రోజులు తమకు చెప్పకుండా ఉండటానికి గల కారణాలు అర్థం చేసుకున్నారు. ఆమె భయపడినట్లుగా కాకుండా ప్రేమగా తమ తల్లిని హత్తుకున్నారు. దాంతో తల్లి భారం కూడా తీరిపోయింది. స్పైగా తాను నిర్వహించిన సాహసాల గురించి పిల్లలకు చెప్పింది. జార్జియాకు  చెందిన మార్థా పీటర్సన్ 1976లో రష్యాలో సీఐఏ నిర్వహించిన ఓ పెద్ద మిషన్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

మరిన్ని వార్తలు