కొడుకును మొస‌లి నుంచి ర‌క్షించిన త‌ల్లి

20 Apr, 2020 18:56 IST|Sakshi

హరారే : త‌ల్లికి త‌న బిడ్డ‌లే స‌ర్వ‌స్వం. అలాంటిది వారి జోలికొస్తే అది మ‌నుషులైనా, జంతువులైనా లెక్క చేయ‌కుండా పోరాడేందుకు సై అంటుంది. ఓ త‌ల్లి కూడా అదే ప‌ని చేసింది. త‌న కూతురును పొట్ట‌న పెట్టుకోవాల‌ని చూసిన మొస‌లితో పోరాడి బిడ్డ‌ను కాపాడుకుంది. ఈ ఘ‌ట‌న జింబాబ్వేలోని చిరేద్జీలో చోటు చేసుకుంది. వివరాలు.. మారినా ముసిసిన్యానా అనే మ‌హిళ త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి రూండే నదీతీరానికి వెళ్లింది. వారిని ఆడుకోమ‌ని చెప్పి చేప‌లు ప‌ట్టడానికి అవ‌త‌లి ఒడ్డుకు పోయింది. ఇంత‌లో ఒక్క‌సారిగా అరుపులు వినిపించాయి. అటువైపు త‌ల‌తిప్పి చూడ‌గా మొస‌లి త‌న మూడేండ్ల కొడుకు జిడియాన్‌పై దాడి చేస్తోంది. బాలుడి త‌ల‌ను నోట క‌రుచుకుని నీళ్ల‌లోకి లాక్కుపోతోంది. అంతే.. ఒక్క అంగ‌లో అక్క‌డికి చేరుకుని మొస‌లిపైకి దూకింది. క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా దాని ముక్కులోకి వేళ్లు పోనిచ్చి ఊపిరాడ‌కుండా చేసింది. (మొసలితో బాలిక పోరాటం.. కళ్లు పీకేసి)

దీంతో అది నెమ్మ‌దిగా అత‌డిపై ప‌ట్టు కోల్పోయి వ‌దిలేసింది. కానీ ఆమె చేతిని బ‌లంగా కొరికింది. మ‌రోవైపు బాలుడికి కూడా మొహంపై గాయాల‌తోపాటు ర‌క్త‌స్రావం అవుతుండ‌టంతో ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి వెళ్లింది. బాలుడి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న గురించి మారినా మాట్లాడుతూ.. "మొస‌లికి శ్వాస ఆడ‌కుండా చేస్తే అది త‌న ప‌ట్టు కోల్పోతుంది. నేనూ అదే చేశాను. కానీ నేను నా కొడుకును ర‌క్షించుకున్నానంటే ఇప్ప‌టికీ న‌మ్మ‌లేక‌పోతున్నాను" అని చెప్పుకొచ్చింది. సోష‌ల్ మీడియాలో ఈ వార్త వైర‌ల్‌గా మార‌గా నెటిజ‌న్లు ఆమె సాహసాన్ని అభినందిస్తున్నారు. "అందుకే తల్లి ప్రేమ గొప్పది‌, వెల‌క‌ట్ట‌లేనిది" అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా వీరు వెళ్లిన రూండే న‌దిలో సుమారు 20 అడుగుల పొడ‌వు పెరిగే మొస‌ళ్లు నివ‌సిస్తున్నాయి. (కరోనాపై బి 'పాజిటివ్‌'!)

మరిన్ని వార్తలు