అమెరికాలో మొదటి 'జికా' మామ్!

1 Jun, 2016 16:08 IST|Sakshi
అమెరికాలో మొదటి 'జికా' మామ్!

న్యూ జెర్సీః  పుట్టబోయే బిడ్డలకు మెదడు సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు జికా వైరస్ వల్ల వస్తున్నాయని వైద్య నిపుణులు ముందే గుర్తించారు. ఇప్పటికే బ్రెజిల్లో తల చిన్నగా ఉండి, మెదడు లోపంతో పిల్లలు పుట్టినట్లు అంచనా కూడ ఉంది. కాగా తాజాగా అమెరికాలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి జికా వైరస్ ఉన్నట్లు వైద్యులు నిర్థారణ చేశారు. న్యూజెర్సీ లోని ఆసుపత్రిలో జికా వైరస్ తో ఉన్నతల్లి ప్రసవించిగా ఆమెకు  చిన్న తలతో ఉన్న శిశువు జన్మించినట్లు వైద్యాధికారులు గుర్తించారు. స్పష్టంగా జికా వైరస్ లక్షణాలు కలిగిన ఇటువంటి కేసు అమెరికా ట్రై స్టేట్స్ లో ఇదే మొదటిసారి అని ఇడా  సీగల్ నివేదించింది.  

దోమకాటువల్ల వ్యాప్తి చెందే జికా వైరస్... ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే బ్రెజిల్ లో దాదాపు పది లక్షలమందికి సోకి, కలకలం రేపుతున్న జికా వైరస్... మెల్లగా ఇతర ఖండాలకూ విస్తరిస్తోంది.అయితే ఈ వైరస్ వల్ల ఇతరుల్లో పెద్దగా లోపాలు కనిపించకపోయినా గర్భిణులకు సోకితే మాత్రం పుట్టబోయే పిల్లలకు మెదడు లోపాలు తలెత్తుతాయంటూ వైరస్ ను నిలువరించేందుకు డబ్ల్యూహెచ్ వో  భారీ కసరత్తు చేస్తోంది. ఈడిస్ ఈజిప్టె రకం దోమల ద్వారా వ్యాప్తి చెందుతున్నజికా వైరస్... సోకిన వెంటనే సాధారణ ప్రజల్లో లక్షణాలు పెద్దగా కనిపించకపోయినా... గర్భిణిలపై మాత్రం ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంటోంది. ప్రస్తుతం అమెరికాలో జికా తల్లికి పుట్టిన బిడ్డ మెదడులోపంతో  ఉండటం ప్రపంచ ఆరోగ్య సంస్థకు పెద్ద సవాలుగా మారింది.

మైక్రో సెఫలి వ్యాధి బారినపడ్డ బిడ్డ.. అమెరికాలోని న్యూజెర్సీ ఆస్పత్రిలో జన్మించింది. ఇలా జికా వైరస్ సోకిన తల్లి ఆమెరికాలోని ఆస్పత్రిని సందర్శించడం ఇదే మొదటిసారి అని హాకెన్సాక్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ అధికారులు అంటున్నారు. అయితే ఆ తల్లి.. పూర్తి వైద్య సంరక్షణ  అందుకుందని చెప్పిన అధికారులు.. ఆమె గోప్యతను గౌరవిస్తూ... ఆమెకు సంబంధించిన మిగిలిన వివరాలను వెల్లడించలేదు. అయితే ఆమె హోండురాస్ కు చెందిన  31 ఏళ్ళ వయసున్న మహిళ అని ఓ వార్తా పత్రిక వెల్లడింరగా... గర్భం ప్రారంభ దశలోనే ఆమె.. దోమకాటు వల్ల జికా బారిన పడిందని ఆసుపత్రి వైద్యుడు ఒకరు తెలిపారు. అల్ట్రా సౌండ్ టెస్ట్ లో లోపాలు కనిపించడంతో  వైద్యులు 35 వారాల గర్భంతో ఉన్న ఆమెకు మంగళవారం  సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. పుట్టిన బిడ్డ.. తక్కువ బరువుతోపాటు, మైక్రోసెఫలీ వ్యాధి కలిగి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ తల్లికి గర్భంతో ఉన్న సమయంలో శరీరంపై కొద్దిపాటి రాష్ తప్పించి.. మిగిలిన ఎటువంటి లక్షణాలు కనిపించలేదని వైద్యులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు