ధనగ్రహం

21 Dec, 2016 00:04 IST|Sakshi
ధనగ్రహం

వానొస్తే... ఏమొస్తుంది? ఆ.. ఏముంది.. నాలుగు చినుకులు పడతాయి. అప్పటివరకూ మలమల మాడిన మట్టి కమ్మటి పరిమళం అందిస్తుంది. కాసేపు ఆహా.. ఓహో అనుకుంటాం. ఆ తరువాత మరచిపోతాం. అంతే! ఇప్పుడు భూమికి కొంచెం దూరం.. కాదు కాదు చాలా దూరంగా వెళదాం. ఎంత దూరమంటే... దాదాపు వెయ్యి కాంతి సంవత్సరాల దూరం. అక్కడే ఉంటుంది ఈ ఫొటోలో కనిపిస్తున్న గ్రహం. వార్విక్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ మధ్యే దీన్ని గుర్తించారు. పేరు ‘హ్యాట్‌ పీ–7బీ’. సైజు.. మన భూమికి దాదాపు 16 రెట్లు ఎక్కువ. మనకు లాగానే అక్కడా కొన్ని వాతావరణ పొరలు ఉన్నాయి.

సౌర కుటుంబానికి ఆవల ఇలాంటి గ్రహం ఒకదాన్ని గుర్తించడం ఇదే తొలిసారి. డాక్టర్‌ డేవిడ్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ అతడి బృందంలోని సైంటిస్ట్‌లు నాలుగేళ్లుగా ఈ వాతావరణాన్ని అందులోని మేఘాలను పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? హ్యాట్‌ పీ –7బీ వాతావరణంలో అల్యూమినియం ఆక్సైడ్‌ స్ఫటికాలు ఉన్నాయి. అయితే ఏంటి అంటారా? ఇవే స్ఫటికాలు భూమ్మీద నేల పొరల్లో ఉంటే వాటిని కెంపులని, నీలాలని పిలుస్తారు మరి! నిజమండీ.. దీనిపై వర్షం కురిస్తే అది ఎర్రటి కెంపులు, నీలాలతో ఉంటుందన్నమాట! ఈ కెంపు, నీలాల మేఘాలు కూడా ఉన్నట్టుండి భారీ సైజులో ఏర్పడుతూ అ తరువాతి క్షణంలోనే మాయమైపోతున్నాయట. ఇదేదో బాగానే ఉందే.. ఇప్పుడు కాకపోతే మరో వందేళ్లకైనా మనవాళ్లు అక్కడికెళ్లి సెటిలైతే బాగుండు అనుకుంటున్నారా? మన పప్పులేం ఉడకవు! ఎందుకంటే అక్కడ మనిషి తట్టుకోలేనంత స్థాయిలో వేడి కూడా ఉందట! రాశుల కొద్దీ కెంపులు, లారీల కొద్దీ నీలాలు వృథాగా పడి ఉన్నాయి అన్నమాట...ప్చ్‌!

మరిన్ని వార్తలు