రూటు మార్చిన రుతుపవనాలు

26 Jul, 2017 01:05 IST|Sakshi
రూటు మార్చిన రుతుపవనాలు
వానాకాలం మొదలై నెల గడుస్తోంది. అడపాదడపా చినుకులు పలకరిస్తున్నాయే గానీ.. పదునైన వానలు తక్కువే. ఎందుకిలా? సింపుల్‌గా చెప్పాలంటే వానలు దిశ మార్చుకున్నాయి. గత 15 ఏళ్లుగా భారతదేశానికి జీవనాడిగా చెప్పుకొనే నైరుతి రుతుపవనాలు మధ్య భారతదేశానికి ఉత్తరంగా ఎక్కువ బలపడ్డాయని మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధన ఒకటి స్పష్టం చేస్తోంది. 2002 నాటి నుంచి ఏటా భారతదేశం మొత్తమ్మీద సగటు ఉష్ణోగ్రత 0.1 డిగ్రీ నుంచి 1 డిగ్రీ సెల్సి యస్‌ వరకూ పెరిగిందని, అదే సమయంలో హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతల పెరుగుదలలో మందగమనం కనిపించిందని ఎంఐటీ గుర్తించింది.

ఈ తేడా ఎక్కువగా ఉండటం వల్ల రుతుపవన మేఘాలు బలంగా మారతాయి. ఎక్కువ వానలు కురిపిస్తాయి. అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పు ఎందుకు వచ్చిందన్న విషయాన్ని ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. నైరుతి రుతుపవనాల తీరుతెన్నులపై బ్రిటిష్‌ కాలం నుంచి రికార్డులు ఉండగా.. 1950 నుంచి ఉన్న వాటిని పరిశీలిస్తే మధ్యభారతదేశం ప్రాంతంలో వర్షపాతం క్రమేపీ తగ్గుతూ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగుతుందని.. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు మరీ అధ్వానమవుతాయని అందరూ అనుకున్నారు. అయితే ఆఫ్రికా, తూర్పు ఆసియా ప్రాంతాల్లో మాదిరిగానే ఈ ప్రాంతంలోనూ పరిస్థితిలో మార్పులు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం ఆలస్యమైందని ఎంఐటీ శాస్త్రవేత్త చెన్‌ వాంగ్‌ అంటున్నారు. 

 

మరిన్ని వార్తలు