మూన్‌ టు మార్స్‌ 

3 Oct, 2017 08:30 IST|Sakshi

అడిలైడ్‌: ఎన్నో ఏళ్లుగా విశ్వాంతరంలో గ్రహాంతరవాసుల ఉనికి కోసం మానవుడు అన్వేషిస్తున్నాడు. ఇలాంటి తరుణంలోనే తానే గ్రహాంతరవాసిగా మారుతాడని బహుశా అతను ఊహించి ఉండడు! ఇతర గ్రహాలపై మానవుడు కాలనీలు కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న వరుస అంతరిక్ష పరిశోధనలు.. ఆ రోజు మరెంతో దూరంలో లేదని చెప్పకనే చెబుతున్నాయి. పెరుగుతున్న గ్లోబల్‌ వార్మింగ్, కాలుష్యం, నానాటికీ పెరుగుతున్న జనాభా, కమ్ముకొస్తున్న అణు యుద్ధ భయాలు, విజృంభిస్తున్న కొత్త వ్యాధులు.. ఇవన్నీ భూగోళాన్ని నివాసానికి పనికిరాని గ్రహంగా మార్చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మానవుడికి దిక్కు ఏమిటి? అని అందరూ ఆలోచిస్తుండగా పక్క గ్రహాల నుంచి మానవుడికి వరుస ఆహ్వానాలు అందుతున్నాయి. మరి మానవుడు మరో గ్రహానికి వెళ్లి నివసించడం సాధ్యమా? చంద్రుడిపైకి వెళ్లాలా, అంగారకుడి మీదకెళ్లాలా? అనే ఎన్నో అనుమానాలు, అభిప్రాయాలు తలెత్తుతున్నాయి.

రానున్న కొన్నేళ్లలో చంద్రుడిపై మానవుడు స్థిర నివాసం ఏర్పరచుకోగలిగితే తర్వాత లక్ష్యం మాత్రం అంగారకుడే (మార్స్‌) అవుతుంది. భూమితో పలు రకాల పోలికలు ఉండటమే దానికి కారణం. ఈ నేపథ్యంలో చంద్రుడిపై శాశ్వతంగా నిర్మించే కుగ్రామం అంగారక గ్రహాన్ని చేరుకోడానికి తొలిమెట్టు అవుతుందని ఇటీవల యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) వెల్లడించింది. అంగారక గ్రహానికి చేరుకుని అక్కడ కాలనీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. తమ తొలి లక్ష్యం చంద్రుడిపై శాశ్వత గ్రామాలను ఏర్పరచడం అయితే అంతిమ లక్ష్యం మాత్రం అంగారకుడిపై కాలనీలు ఏర్పాటు చేయడమేనని ఈఎస్‌ఏ తెలిపింది. మానవ మనుగడ విస్తరణకు చంద్రుడు ఒక చక్కని ప్రదేశమని అడిలైడ్‌లో 4 వేల మంది అంతర్జాతీయ అంతరిక్ష నిపుణులతో జరిగిన వార్షిక సమావేశంలో ఈఎస్‌ఏ పేర్కొంది. ‘ఓ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకుని 17 ఏళ్లుగా నివసిస్తున్నాం. చంద్రుడి ఉపరితలంపై శాశ్వత, అనువైన గ్రామాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని భావిస్తున్నాం.

అలాగే అంగారక గ్రహంపైకి తొలి హ్యూమన్‌ మిషన్‌ ప్రారంభించే దశలో ఉన్నాం’అని ఈఎస్‌ఏకు చెందిన శాస్త్రవేత్త పియరో మెస్సినా వివరించారు. ‘చంద్రుడిపైకి వచ్చే పదేళ్లలో కొన్ని మిషన్లకు ప్రణాళికలు తయారు చేశాం. ఈ మిషన్లు ఓ ఉద్యమాన్ని లేవనెత్తి చంద్రుడిపై శాశ్వత గ్రామాన్ని నిర్మించేందుకు అవసరమైన సమాచార సంపదను సృష్టిస్తాయి’అని వివరించారు. మరోవైపు 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఉపసంహరించుకోనున్న నేపథ్యంలో.. దానికి ప్రత్యామ్నాయంగా శాశ్వత లూనార్‌ కాలనీ (చంద్ర గ్రామం)ని ఏర్పాటు చేసేందుకు స్పేస్‌ ఏజెన్సీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ‘డీప్‌ స్పేస్‌ గేట్‌వే’అనే కార్యక్రమంలో భాగంగా తొలి లూనార్‌ స్పేస్‌ స్టేషన్‌ను నిర్మించే ప్రాజెక్టును నాసా (నేషనల్‌ ఏరోనాటిక్స్, స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) చేపట్టింది. ఈ లూనార్‌ స్టేషన్‌ ఏర్పాటుకు సంబంధించి రష్యా స్పేస్‌ ఏజెన్సీ, నాసా ఇటీవల సహకార ఒప్పందం కూడా చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు