ఇప్పటివరకు 3,800 మంది మృతి

10 Mar, 2020 04:50 IST|Sakshi

1,10,000 మందిలో వైరస్‌

భారత్‌పై ఖతార్‌ నిషేధం

ప్యారిస్‌/బీజింగ్‌/ఖతార్‌/టెహ్రాన్‌: ప్రపంచం మొత్తమ్మీద వంద దేశాలకు విస్తరించిన కోవిడ్‌ కారణంగా ఇప్పటివరకూ 3,800 మంది మరణించారు. లక్షాపదివేల మంది వైరస్‌ బారిన పడ్డారు. వైరస్‌ కట్టడికి ఇటలీలో సుమారు కోటీ యాభై లక్షల జనాభా ఉన్న దేశ ఉత్తర ప్రాంత సరిహద్దులను సీజ్‌ చేయాలని ఇటలీ యోచిస్తోంది. భారత్‌ సహా 14 దేశాలకు రాకపోకలపై ఖతార్‌ నిషేధం విధించింది. వైరస్‌కు కేంద్ర బిందువుగా భావిస్తున్న చైనాలో మరణాల సంఖ్య తగ్గుతోంది. సోమవారం కొత్తగా కోవిడ్‌ బారిన పడ్డ వారి సంఖ్య 40 మాత్రమేనని చైనా  తెలిపింది. ఇరాన్‌లో ఒక్క సోమవారమే 600 మంది ఈ వ్యాధి బారిన పడినట్లు తెలియడం ఆందోళన కలిగించే అంశం. చైనాలో కోవిడ్‌ మరణాల సంఖ్య 3119కి చేరింది. పరిస్థితి అదుపులోకి వస్తే నిర్బంధాలను త్వరలో ఎత్తేసే చాన్సుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

ఇరాన్‌లో ఏడువేల మంది బాధితులు
ఇరాన్‌లో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 7161కి చేరుకుంది. వ్యాధి కారణంగా సోమవారం 43 మంది మరణించగా ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 237గా ఉంది. టెహ్రాన్‌లో మొత్తం 1945 కోవిడ్‌ కేసులు ఉండగా.. ఖోమ్‌లో 712 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.

మిలాన్‌ విలవిల
పర్యాటకుల స్వర్గధామం మిలాన్‌ కరోనా వైరస్‌ దెబ్బకు విలవిల్లాడిపోతోంది. వీధులు, బీచ్‌లు నిర్మానుష్యంగా మారిపోగా వెనిస్‌ నగర సందర్శనకు వాడే గండోలా (చిన్న పడవలు) బోసిపోయి కనిపించాయి. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారు నెలల జైలు లేదా 206 యూరోల జరిమానాకు సిద్ధం కావాలని, తగిన అత్యవసర కారణాలు ఉన్న వారే క్వారంటైన్‌ జోన్‌ నుంచి బయటకు రావాలని స్పష్టం చేసింది.

మద్యం తాగి 27 మంది మృతి
మద్యం తాగితే కరోనాను నియంత్రించవచ్చంటూ సోషల్‌ మీడియాలో వచ్చిన వదంతులు నమ్మి అతిగా మద్యం తాగి 27 మంది మృతి చెందిన ఘటన ఇరాన్‌లో జరిగింది. ‘తమకున్న లక్షణాలను చూసి కరోనాగా వారు భ్రమపడి అతిగా ఆల్కహాల్‌ తాగడంతో మరణించారు’ అని వైద్యులు స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు