వియత్నాం వార్‌కు మించి కరోనా మృతులు

29 Apr, 2020 15:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో కరోనా వైరస్‌ బారిన పడి బుధవారం మధ్యాహ్నంకు 58,964 మంది మరణించారు. 20 ఏళ్లపాటు వియత్నాంతో చేసిన యుద్ధంలో 58,220 మంది అమెరికన్లు చనిపోగా, అంతకన్నా ఎక్కువగా మూడు నెలల కాలంలోనే కరోనా వైరస్‌ బారిన పడి అమెరికన్లు మరణించారు. 1968 నాటి వియత్నాం యుద్ధంలో ప్రతి లక్ష మందిలో 8.5 మంది అమెరికన్లు మరణించగా, కరోనా వైరస్‌ బారిన పడి ప్రతి లక్ష మందిలో 17.6 మంది మరణించారు. 1968, జనవరి 31వ తేదీన అత్యధికంగా 246 మంది మరణించారు. ఆ సంవత్సరంలో అత్యధికంగా 16,899 మంది మరణించారు. అమెరికాలో ఏప్రిల్‌ 28వ తేదీ నాటికే కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య 10,36,657కు చేరుకుంది.

వియత్నాం యుద్ధంలో ఎక్కువ మంది చనిపోతుండడంతో ఆ యుద్ధం నుంచి తప్పుకోవాలంటూ యుద్ధానికి వ్యతిరేకంగా వేలాది మంది అమెరికన్లు నిరసన ప్రదర్శనలు జరిపారు. ఇప్పుడు కరోనా బారిన పడి అంతకన్నా ఎక్కువ మంది మరణించినప్పటికీ లాక్‌డౌన్, సామాజిక దూరం లాంటి ఆంక్షలను ఎత్తివేయాలంటూ అమెరికన్లు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు జరపుతున్నారు. 2017-18 సంవత్సరంలో ఎనిమిది నెలల కాలంలో ఇన్‌ఫ్లూయెంజా దాడి చేయడంతో 61 వేల మంది మరణించారని ‘సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్స్‌ అండ్‌ ప్రివేన్షన్‌’ వెల్లడించింది. కరోనా మృతుల సంఖ్య ఆ సంఖ్యను కూడా దాటుతుందని సులభంగానే గ్రహించవచ్చు. ఆగస్టు నెలాఖరు నాటికి కరోనా మృతుల సంఖ్య దాదాపు 75 వేలకు చేరుకుంటుందని వైద్యులు అంచనా వేశారు.(కరోనా.. అధ్యక్ష ఎన్నికలపై అమెరికన్ల మనోగతం!)

మరిన్ని వార్తలు