శ్మశానాల్లోనూ ఫ్రీ వై-ఫై!

11 Dec, 2015 12:59 IST|Sakshi
శ్మశానాల్లోనూ ఫ్రీ వై-ఫై!

మాస్కో: రష్యా రాజధాని మాస్కో వాసులు ఇప్పటివరకు హోటళ్లు, మెట్రో స్టేషన్లలో వైర్‌లెస్‌ ఫ్రి ఇంటర్నెట్ సదుపాయాన్ని ఆస్వాదించారు. ఇక వాళ్లు ఊహించనివిధంగా నగరంలోని శ్మశానాల్లోనూ ఉచిత వై-ఫై సేవలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మొదట వాగన్‌కోవ్‌, ట్రోయెకురొవ్‌, నొవొడెవిచీ శ్మశానవాటికల్లో వచ్చే ఏడాది వై-ఫై ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభించనున్నారు. ఇక్కడే మొదట ఎందుకంటే.. ఈ శ్మశానాల్లోనే రష్యా దిగ్గజాలైన ప్రముఖ రచయిత ఆంటన్ చెకొవ్‌, సోవియట్ నేత నికిత కృశ్చేవ్, మొదటి రష్యా అధ్యక్షుడు బోరిస్ యెల్ట్‌సిన్‌ను ఖననం చేశారు.

ఈ శ్మశానాలు ప్రజలకు బహిరంగ మ్యూజియంలుగా మారిపోయాయని, ఇక్కడికి ప్రజలు తరచుగా వచ్చి ఏదో ఒక సమాధి ముందు నిలబడి.. అందులో ఖననం చేయబడిన ప్రముఖ వ్యక్తి గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటారని, అందుకే వీటిలో ఉచిత వై-ఫై సేవలు అందించాలని భావిస్తున్నామని మాస్కో శ్మశాన నిర్వహణ సంస్థ ప్రతినిధి లిల్యా ల్వొస్కాయా తెలిపారు. వీటిలో వై-ఫై సేవలు ప్రజాదరణ పొందితే నగరంలోని 133 శ్మశానవాటికలకూ ఈ సేవలు విస్తరింపజేయాలని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు