పాక్‌ బ్యాంకులపై సైబర్‌ దాడి

7 Nov, 2018 01:24 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో వేలాది మంది బ్యాంకు ఖాతాలు హ్యాకింగ్‌ గురయ్యాయి. గత నెలలో జరిగిన ఈ సైబర్‌ చొరబాటు కారణంగా కోట్లాది రూపాయలు హ్యాకర్ల చేతిలోకి వెళ్లాయని అధికారులు తెలిపారు. పలువురి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగుచూసింది. దీనిపై విచారణ ప్రారంభించామని అధికారులు వెల్లడించారు. అక్టోబర్‌ 27, 28లలో జరిగిన ఈ సైబర్‌ దాడుల్లో సుమారు 12 బ్యాంకులకు చెందిన 8 వేల మంది ఖాతాదారులు నగదు కోల్పోయారు.

అక్టోబర్‌ 27న అంతర్జాతీయ కార్డుల రూపంలో తమ బ్యాంకు రూ.26 లక్షలు కోల్పోయిందని, అప్పటి నుంచి అలాంటి చెల్లింపులను నిలిపివేసినట్లు బ్యాంక్‌ ఇస్లామి తెలిపింది. తన ఖాతా నుంచి హ్యాకర్లు రూ.30 లక్షలు దోచుకున్నారని ప్రముఖ శాస్త్రవేత్త ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా, అన్ని డెబిట్, క్రెడిట్‌ కార్డుల ఆధారంగా జరిపే అంతర్జాతీయ చెల్లింపులను తక్షణమే నిలిపివేయాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ బాధిత బ్యాంకులను ఆదేశించింది. 

మరిన్ని వార్తలు