బిడ్డను కాపాడుకునేందుకు..

13 Oct, 2018 19:55 IST|Sakshi
గాయాలతో ఫియోనా సింప్సన్‌

ఏ తల్లికైనా సరే తన ప్రాణాల కంటే కూడా బిడ్డ ప్రాణాలే ముఖ్యం. బిడ్డకు ఆపద వస్తుందని తెలిస్తే తానే కవచంగా మారి కాపాడుకుంటుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఫియోనా సింప్సన్‌ కూడా ఆ కోవకు చెందిన వారే. వడగండ్ల నుంచి తన పసికందును కాపాడుకునేందుకు ఆమె చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు.

వివరాలు... ఆస్ట్రేలియాలో టోర్నడో, వడగండ్ల వాన బీభత్సాన్ని సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇటీవలే ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. వాటిని నిజం చేస్తూ వడగండ్ల వాన క్వీన్‌ల్యాండ్స్‌పై విరుచుకు పడింది. అయితే వాన మొదలయ్యే కంటే కొంచెం ముందుగా ఆస్పత్రి నుంచి తన బామ్మ, బిడ్డతో ఫియోనా సింప్సన్‌ అనే మహిళ కారులో ఇంటికి బయల్దేరింది. సరిగ్గా అదే సమయంలో పెనుగాలులతో కూడిన వడగండ్ల వాన మొదలైంది. టెన్నిస్‌ బాల్స్‌ సైజులో ఉన్న రాళ్ల దాటికి ఫియోనా కారు అద్దాలు కూడా పగిలిపోయాయి. దీంతో తన చిన్నారిని కాపాడేందుకు ఆమె కవచంలా మారింది. రాళ్ల దెబ్బలు భరిస్తూ చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో ఆమె తీవ్రంగా గాయపడింది. కానీ తన బిడ్డను ప్రాణాపాయం నుంచి తప్పించి తల్లి ప్రేమకు మించిన ప్రేమ మరొకటి ఉండదని నిరూపించింది. ఫియోనాకు సంబంధించిన కథనం ఆస్ట్రేలియా స్థానిక మీడియాలో ప్రచారం కావడంతో ప్రస్తుతం ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

మరిన్ని వార్తలు