చనిపోయిన పాపను ఇలా కలుసుకున్న తల్లి

11 Feb, 2020 16:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆత్మీయులు అకాలంగా మరణిస్తే ఎవరికైనా అంతులేని దు:ఖం కలుగుతుంది. అలా కన్న పేగు దూరమైతే వారి దు:ఖం ఇంకా అంతులోనిది. పొగిలి పొగిలి ఏడ్చినా తీరనిది ఆ బాధ. కలలో తప్పించి వారు వారికి కనిపించరు. అలా దూరమైన వారిని, పేగు బంధాన్ని నిజంగా కలుసుకుంటే....కళ్లతో చూస్తూ పెదవులతో మాట్లాడుతూ, చేయి చేయి పట్టుకొని స్పర్శిస్తే..... నిజంగా అది సాధ్యమైతే ఆ అనుభూతి అపారమైనతి. ఎన్నటికీ మరవలేనిది. మరపురానిది. 

ఓ కొరియన్‌ టీవీ ‘మీటింగ్‌ యూ’ అనే షోలో జాంగ్‌ జీ సంగ్‌ అనే తల్లికి 2016లో మరణించిన తన కూతురు నయ్యేన్‌ను చూడటమే కాదు, కలసుకొని మాట్లాడే వీలు కల్పించింది. ఆ తల్లిని ఓ మైదానంలోకి తీసుకెళ్లింది. ఆడుతూ, ఆడుతూ చెక్కల చాటున దాచుకొని అప్పుడే అమ్మా అంటూ ఏడేళ్ల పాప ఆ తల్లి ముందుకు రావడం, ‘ఓ మై ప్రెటీ ఐ మిస్డ్‌ యూ’ అంటూ ఆ తల్లి ఆ పాప ముఖాన్ని ముట్టుకొని స్పర్శించే ప్రయత్నించడం మనమూ చూడగలం. ఊదారంగు గౌను, నల్లటి జుట్టు కలిగి మెరుస్తున్న కళ్లతో ఆ తల్లిని చూస్తూ ‘ఎక్కడికి పోయావ్‌ ఇంతకాలం. అసలు నేను గుర్తున్నానా?’ అంటూ అమాయకంగా ప్రశ్నించడం, ‘నిన్ను ఎలా మరచిపోతాను రా కన్నా!’ అంటూ ఆ తల్లి చెప్పడం, ‘అమ్మా నిన్ను ఎంతో కోల్పోయాను’ ‘నేను కూడా ఎంతో కోల్పోయాను’ అంటూ తల్లీ కూతుళ్లు పరస్పరం చెప్పుకోవడం ఆ తల్లికే కాదు, వారిని చూస్తున్న ప్రేక్షకుల్లోని ఆ పాప తండ్రి, సోదరుడు, సోదరితోపాటు ప్రేక్షకులు కంటతడి పెట్టడం అందరిని కలచివేస్తుంది. 

ఆ పాప ఓ పువ్వు పట్టుకొని తల్లి దగ్గరకు పరుగెత్తుకు రావడం ‘అమ్మా! ఇక నిన్నెప్పుడు బాధ పెట్టను’ అని హామీ ఇవ్వడం అందరి హృదయాలను హత్తుకుంటుంది. ఆ తర్వాత ఆ పాప టుంగుటూయల పరుపెక్కి ఏదో చదివి తల్లికి వినిపించడం, అలసిపోయానమ్మా, ఇక పడుకుంటానంటూ చెప్పడం, అందుకు పాపకు బాయ్‌ చెప్పడంతో ఆ తల్లి, ప్రేక్షకులు ఈ లోకం లోకి వస్తారు. ఈ పాటికి అర్థమై ఉండాలి. ‘వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌)’ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జాంగ్‌ జీ సంగ్‌ అనే తల్లికి తన కూతురుని కలసుకునే అవకాశాన్ని కొరియన్‌ టీవీ కల్పించింది. ‘మున్వా బ్రాడ్‌ క్యాస్టింగ్‌ కార్పొరేషన్‌ (ఎంబీసీ)’ నయ్యోన్‌ డిజిటల్‌ క్యారెక్టర్‌ను సృష్టించేందుకు ఎంతో శ్రమించింది. డిజిటల్‌ కెమెరా ముఖానికి, డిజిటల్‌ గ్లౌవ్స్‌ను ధరించడం ద్వారా జాంగ్‌ నిజంగా తన కూతురును కలుసుకున్న అనుభూతిని పొందారు. తాను తన కూతురు నయ్యేన్‌ ఎప్పటికీ మరచిపోనని, ఈ టీవీ షోను చూసిన వారెవరు కూడా నయ్యేన్‌ మరచిపోరాని జాంగ్‌ తన బ్లాక్‌లో రాసుకున్నారు. 

మరిన్ని వార్తలు