ద్రాక్ష పండ్లు, మంచి నిద్రతో మాతృత్వం

18 Nov, 2016 00:42 IST|Sakshi
ద్రాక్ష పండ్లు, మంచి నిద్రతో మాతృత్వం

సంతానానికి నోచుకోని మహిళలకు ఇదో శుభవార్త. కంటినిండా నిద్రపోవడం, వీలైనంత ఎక్కువగా ద్రాక్ష పండ్లు తినడం ద్వారా కడుపు పండేందుకు అవకాశాలు మెరుగవుతాయని అంటున్నారు సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. మహిళలను బాధించే ఎండోమెట్రి యోసిస్‌కు సంబంధించిన అవగాహనలో మార్పు ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామంటున్నారు. విపరీతమైన కడుపునొప్పి, నెలసరి సక్రమంగా లేకపోవడం ఎండోమెట్రియోసిస్ లక్షణాల్లో కొన్ని. గర్భం ధరించాలంటే పక్వదశలో ఉన్న అండాలను విడుదల చేయాల్సి ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ కారణంగా అండాలు పక్వదశకు చేరకుండానే విడుదలవుతున్నట్లు తాజా పరిశోధనలో తెలిసింది. ఫాలికల్స్‌లో ఉండే ద్రవాల కారణంగా అండాలు దెబ్బతింటున్నట్లు వీరు గుర్తించారు.

ఈ ద్రవాల కారణంగా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ (ఆర్‌వోఎస్) రసాయనాల ఉత్పత్తి జరుగుతుందని, ఇవి అండాల్లోని డీఎన్‌ఏను దెబ్బతీస్తాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న పరిశోధకుడు డాక్టర్ సైమన్‌లేన్ తెలిపారు. ద్రాక్ష పండ్లతోపాటు బ్లూబెర్రీలు, వేరుశనగలోనూ ఉండే యాంటీ యాక్సిడెంట్ రిస్‌వెరట్రాల్, మంచి నిద్రతో శరీరానికి చేరే మెలటోనిన్‌ల ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చునని తాము ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా తెలుసుకున్నామని వివరించారు.

మరిన్ని వార్తలు