ఎంతైనా అమ్మ మనసు!

5 Nov, 2017 00:51 IST|Sakshi

తల్లిప్రేమను ఈ సృష్టిలో దేనితోనూ పోల్చలేం. ఎందుకంటేఅమ్మ ప్రేమ అంతకంతకు పెరిగే అమృతం.కొడుకు నింగికి నిచ్చెనలేసేంత గొప్పవాడైనా అమ్మ ముందు పసివాడే.. ఇందుకు నిలువెత్తు నిదర్శనం ఈ తల్లీకొడుకులు. ఉమ్మడి కుటుంబాలు ముక్కలయ్యాక ఓల్డేజ్‌ హోమ్‌ల సంఖ్య పెరిగింది. అలా ఓల్డేజ్‌ హోమ్‌కు చేరుకున్నవారిలో టామ్‌ కీటింగ్‌ కూడా ఒకరు.

ప్రస్తుతానికి ఆయన వయసు 80 ఏళ్లు. దీంతో ఆయన తనకుతానుగా పనులు చేసుకోలేరు కాబట్టి ఆయనకు సపర్యలు చేయడానికి ఎవరినైనా పంపాలంటూ టామ్‌ కుటుంబ సభ్యులకు ఓల్డేజ్‌ హోమ్‌ నుంచి వర్తమానం అందింది. ఆవర్తమానం చదివిన ఓ 98 ఏళ్ల వృద్ధురాలు చటుక్కున లేచింది. మూటాముల్లే సర్దుకుని ఓల్డేజ్‌ హోమ్‌కు చేరుకుంది.

ఆ వృద్ధురాలిని చూడగానే టామ్‌ ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ‘అమ్మా’.. అంటూ ఆప్యాయంగా హత్తుకున్నాడు. వీరిద్దరినీ చూసి మిగతావారంతా నోరెళ్లబెట్టారు. ఓల్డేజ్‌ హోమ్‌కు వచ్చిన ఆ తల్లిపేరు అదా. ఆమెకు నలుగురు సంతానంలో టామ్‌ పెద్దవాడు. తండ్రి చనిపోవడంతో తల్లిని చూసుకునేందుకు పెళ్లి కూడా చేసుకోలేదు. వయసు పైబడ్డాక వృద్ధాశ్రమంలో చేరాడు.

ఇంట్లో ఉన్నన్నాళ్లూ కొడుకును కంటికి రెప్పలా చూసుకున్న ఆ తల్లి.. ఓల్డేజ్‌ హోమ్‌లోనూ అంతే ప్రేమతో చూసుకుంటోంది. ప్రస్తుతం ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ శేషజీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. తల్లీకొడుకులు ఇప్పుడు గడుపుతున్న జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని ఓల్డేజ్‌ హోమ్‌ నిర్వాహకులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు