మౌంట్‌ సినబంగ్‌.. భారీ పేలుడు చూడండి

22 Feb, 2018 14:25 IST|Sakshi
సినబంగ్‌ పేలుడు దృశ్యం

జకార్త : అగ్ని పర్వతాల రాజ్యం ఇండోనేషియాలో మరోసారి ప్రజలు వణికిపోతున్నారు. మౌంట్‌ సినబంగ్‌ అగ్నిపర్వతం బద్ధలు కావటమే ఇందుకు కారణం. సోమవారం ఇది సంభవించంగా.. ఆ ప్రభావంతో వాతావరణంలో విషవాయువుల స్థాయి తారాస్థాయికి చేరుకుంది. 

ఫిబ్రవరి 19న ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పర్వత రూపు రేఖల్లో సమూల మార్పులు సంభవించగా.. లావా సుమారు 5 కిలోమీటర్లపాటు ప్రయాణించింది. పర్వతం వెదజల్లిన బూడిద సుమారు 162 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతంలో పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం వాటిల్లలేదని ఇండోనేషియా విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది.

ఇండోనేషియాలో ఉన్న 120 అగ్ని పర్వతాలలో  సినబంగ్‌ ఒకటి. 2010లో ఇది రగులుకోవటం ప్రారంభించింది. ఇక నాసా ఈ విధ్వంసంపై ఓ ప్రకటన విడుదల చేసింది. అగ్ని పర్వతం నుంచి వెలువడే వాయువుల్లో సల్ఫర్‌ డై యాక్సైడ్‌ పరిమాణం ఎక్కువగా ఉందని పేర్కొంది. దీంతో అధికారులు ఇళ్ల నుంచి బయటకు రాకపోవటమే మంచిదని ప్రజలకు సూచిస్తున్నారు. ఇక పేలుడు సమయంలో ఓ స్కూల్‌ వద్ద పిల్లలు ఆసక్తిగా గమనించటం.. మరికొందరు హహాకారాలు చేస్తున్న వీడియో ఒకటి నెట్‌లో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు