డ్రెస్‌ కోడ్‌ పేరుతో మహిళలపై వివక్షత

7 Mar, 2017 10:57 IST|Sakshi
డ్రెస్‌ కోడ్‌ పేరుతో మహిళలపై వివక్షత

లండన్‌: నికోలా థోర్ప్ అనే యువతి లండన్‌లోని ఓ సంస్థలో రిసెప్షనిస్ట్‌గా పనిచేసేది. ఆఫీసుకు ఓ రోజు హై హీల్స్‌ వేసుకుపోనందుకుగాను ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక అప్పటి నుంచి ఆమె.. ఉద్యోగాల్లో డ్రెస్‌ కోడ్ పేరుతో మహిళల పట్ల అమానుషంగా వ్యవహరించడంపై పోరాడుతోంది. థోర్ప్‌ పోరాటానికి అన్ని వర్గాల నుంచి అనూహ్య మద్దతు లభించింది. సుమారు 1,50,000 మంది వర్క్ ప్లేస్‌లో మహిళలకు డ్రెస్‌ కోడ్‌కు వ్యతిరేకంగా పార్లమెంట్ వెబ్‌సైట్‌లో థోర్ప్ దాఖలు చేసిన ఆన్‌లైన్‌ పటిషన్ పై సంతకాలు చేశారు.

దీంతో బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యులు, మంత్రులు ఈ అంశంపై వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో డిబేట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై కొనసాగుతున్న ఈ డ్రెస్కోడ్ వివక్షను రూపుమాపేందుకు చర్యలు చేపడతామని వారు హామీ ఇచ్చారు. డిబేట్‌లో భాగంగా లేబర్‌ పార్టీ ఎంపీ గిల్ ఫర్నిస్‌ తనకూతురు ఎమిలి(27) ఏవిధంగా వివక్షకు గురయ్యారో వివరించారు. డ్రెస్ కోడ్లో భాగంగా హై హీల్స్‌ వేసుకున్న ఎమిలి కాలికి గాయం అయిందని ఆమె వెల్లడించారు. గాయం కారణంగా తీసుకున్న సెలవులకు ఆమె పనిచేస్తున్న సంస్థ చెల్లింపులకు నిరాకరించిందని తెలిపారు.

పొట్టి దుస్తులు, హై హీల్స్‌తో పాటు కొన్ని ఉద్యోగాల్లో ఎలాంటి లిప్‌స్టిక్ వాడాలో కూడా చెబుతున్నారని గిల్‌ వెల్లడించారు. కొన్ని చోట్ల పనిచేసే మహిళలు 8 గంటలు హై హీల్స్‌లో నిలబడాల్సి వస్తుందని, ఇది అనేక సమస్యలకు దారి తీస్తుందని గిల్‌ వాపోయారు. మరో ఎంపీ, పిటిషన్స్‌ కమిటీ చైర్మన్ హెలెన్‌ జోన్స్‌ ఈ తరహా వివక్షకు సంబంధించిన విషయాలు తమను షాక్‌కు గురిచేశాయని తెలిపారు. మహిళా ఉద్యోగులను డ్రెస్‌ కోడ్ పేరుతో వేధింపులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు