చైనా కట్టడికి అంతర్జాతీయ కూటమి

7 Jun, 2020 04:39 IST|Sakshi

అమెరికాసహా 8 దేశాల పార్లమెంట్‌ సభ్యులతో..

వాషింగ్టన్‌: ప్రపంచ వాణిజ్యం, భద్రత, మానవహక్కులకు చైనాతో పొంచి ఉన్న ప్రమాదాన్ని కట్టడిచేసేందుకు అమెరికా సహా ఎనిమిది దేశాలు అంతర్జాతీయ కూటమిగా ఏర్పడ్డాయి. ఎనిమిది దేశాల్లోని 19 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన ఈ కూటమి తమ తమ దేశాలు చైనాకు వ్యతిరేకంగా కఠినమైన సామూహిక నిర్ణయాలు తీసుకునేవైపు ప్రయత్నాలు కొనసాగించనున్నాయి. హాంకాంగ్‌ స్వయం ప్రతిపత్తిని నియంత్రించే నేషనల్‌సెక్యూరిటీ లెజిస్లేషన్‌ని అమెరికా మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. అమెరికా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్, నార్వే సహా యూరోపియన్‌ పార్లమెంటు సభ్యులతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు.

అమెరికా సెనేటర్‌ మార్కో రుబియో, డెమొక్రాట్‌ బాబ్‌ మెనెండేజ్, జపాన్‌ మాజీ రక్షణ మంత్రి జెన్‌ నకటానీ, యూరోపియన్‌ పార్లమెంటు విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యులు మిరియం లెక్స్‌మాన్, ప్రముఖ యూకే కన్సర్వేటివ్‌ చట్టసభ్యులు లైన్‌ డన్‌కన్‌ స్మిత్‌లు కూటమిలో సభ్యులుగా ఉన్నారు. కమ్యూనిస్టు పాలనలో చైనా ప్రపంచానికే పెను సవాల్‌గా మారిందంటూ తరచూ చైనాని విమర్శించే అమెరికన్‌ సెనేటర్‌ రుబియో వీడియో సందేశాన్ని ట్వీట్‌ చేశారు. హాంకాంగ్‌ విషయం తమ అంతర్గత విషయమని చైనా పదే పదే నొక్కి చెపుతోన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ నిబంధనలూ, సంబంధాలను సరిగ్గా అర్థం చేసుకోవాలనీ, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం తమ దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దనీ చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్‌ షువాంగ్‌ మీడియాతో వ్యాఖ్యానించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు