కాస్ట్‌లీ బురద.. తలరాతను మార్చేస్తోంది

19 Apr, 2018 14:38 IST|Sakshi
మినామిటోరీ ఐలాండ్‌ (ఇన్‌సెట్‌లో ఇట్రియం శకలం)

టోక్యో : బురద పేరుకు పోయి పర్యాటక రంగానికి కూడా పనికి రాకుండా పోయిన ఆ దీవి.. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించేదిగా మారింది. జపాన్‌ తలరాతను మార్చేసే వార్తలను జపనీస్‌ పరిశోధక బృందం ఒకటి వెలుగులోకి తెచ్చింది. జపాన్‌కు 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినామిటోరీ ఐలాండ్‌లో తాజాగా అరుదైన ఖనిజాలను గుర్తించారు. సుమారు కోటి 60 లక్షల టన్నుల బురదలో అరుదుగా లభించే ఖనిజాలను వెలుగులోకి తెచ్చారు.

ఇట్రియం, యూరోపియం, టెర్బియం, డిస్‌ప్రోజియం.. ఇలా అరుదైన ఖనిజాలను కనిపెట్టింది. వీటిని స్మార్ట్‌ఫోన్స్, మిస్సైల్ వ్యవస్థలు, రాడార్ పరికరాలు, హైబ్రిడ్ వాహనాల తయారీలో వాడుతారు.  ఈ దీవి జపాన్ సరిహద్దులోనే ఉందని.. దానిపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని టోక్యో వర్గాలు ప్రకటించుకున్నాయి. ఇప్పటికే ఇట్రియం అనే అరుదైన ఖనిజాన్ని ఈ బురదలో నుంచి వెలికి తీయగా.. సమీప భవిష్యత్‌లో మిగతా ఖనిజాల వెలికితీత ప్రారంభం కానుంది. ఇట్రియంను కెమెరా లెన్స్‌లు, సూపర్ కండక్టర్స్, సెల్‌ఫోన్ స్క్రీన్ల తయారీలో వాడుతారు.

ఇక ఈ బురదలో 780 ఏళ్లకు సరిపడా ఇట్రియం, 620 ఏళ్లకు సరిపడా యూరోపియం, 420 ఏళ్లకు సరిపడా టెర్బియం, 730 ఏళ్లకు సరిపడా డిస్‌ప్రోజియం ఉన్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచానికి అవసరమైన చాలా అరుదైన ఖనిజాలు చాలా కొన్ని ప్రదేశాల్లోనే లభిస్తాయని, అందులో ఇదీ ఒకటని యూఎస్ జియోలాజికల్ సర్వే తేల్చి చెప్పింది. అరుదైన భూఖనిజాల విషయంలో ప్రపంచమంతా చైనాపైనే ఆధారపుడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్‌ గనుక ఈ ఖనిజాల ఉత్పత్తిని కొనసాగిస్తే మాత్రం ఏడాది తిరగకుండానే చైనాను మించి పోవటం ఖాయమని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. 

>
మరిన్ని వార్తలు