అశ్రునయనాల మధ్య అలీ అంత్యక్రియలు

11 Jun, 2016 08:10 IST|Sakshi
అశ్రునయనాల మధ్య అలీ అంత్యక్రియలు

 లూయిస్‌విల్లే: వేలాది మంది అశ్రునయనాల మధ్య విశ్వవిఖ్యాత బాక్సర్‌ మొహమ్మద్‌ అలీ(74) అంత్యక్రియలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. సొంత నగరం లూయిస్‌విల్లే వీధుల గుండా సాగిన ఆయన అంతిమయాత్రను చివరిసారిగా తిలకించేందుకు అభిమానులు పోటెత్తారు. ‘అలీ వియ్‌ లవ్‌ యూ..’ అనే ప్లకార్డులతో మహాయోధుడికి చివరిసారిగా వీడ్కోలు పలికారు. సీతాకోక చిలుకలా విహరించు.. అనే తన నినాదానికి అనుగుణంగా కాన్వాయ్‌లోని వాహనాలకు బట్టర్‌ఫ్లయ్‌ గుర్తులను ఉంచారు. 1960లో ఒలింపిక్‌ స్వర్ణం సాధించిన అనంతరం అలీని ఘనంగా ఊరేగించిన మార్గంలోనే ఆయన చివరి యాత్రను కూడా సాగించారు. కేవ్‌ హిల్‌ శ్మశానవాటికలో ముస్లిం సంప్రదాయ పద్దతిలో ఆయన అంత్యక్రియలు పూర్తిచేశారు.  

 ఈ కార్యక్రమంలో పలువురు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొనున్నారు. మాజీ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్, హాలీవుడ్ యాక్షన్ హీరో విల్ స్మిత్లు అలీ అంత్యక్రియలకు హాజరై  స్వయంగా అలీ భౌతిక దేహాన్ని తమ భుజాలపై మోశారు. సెలబ్రిటీలతో పాటు సామాన్య అభిమానులు కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తన కెరీర్లో ఎందరో యోధులను మట్టికరిపించిన అలీ శ్వాసకోస సంబంధిత సమస్యతో ఫినిక్స్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం గత శనివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే.


మరిన్ని వార్తలు