నిజాయితీలో నెం-2 ముంబై

27 Sep, 2013 01:01 IST|Sakshi

వాషింగ్టన్: ప్రపంచంలో అత్యంత నిజాయితీగల నగరాల్లో ముంబైకి రెండోస్థానం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా 16 నగరాల్లో నిర్వహించిన ఓ సర్వేలో ఫిన్లాండ్ రాజధాని హెల్సీంకీకి ఈ విషయంలో మొదటిస్థానం లభించింది. పోర్చుగల్ రాజధాని లిస్బన్ చివరిస్థానంలో నిలిచింది. మనీ పర్సులను రోడ్డుపై పడవేసి ఎంతమంది వాటిని స్వంతదారులకు తిరిగి ఇచ్చారన్న పరీక్షద్వారా ఈ సర్వేను నిర్వహించారు. ఇలా వందలాదిమంది ప్రవర్తనను గమనించారు. యూరప్, ఉత్తర-దక్షిణ అమెరికాలు, ఆసియాలోని వివిధ నగరాల్లో సర్వేను నిర్వహించారు.
 
  ప్రతీ పర్సులో ఓ సెల్‌ఫోన్ నెంబర్, ఫ్యామిలీ ఫొటో, వివిధ కూపన్లు, బిజినెస్ కార్డులు, 50 డాలర్ల విలువగల కరెన్సీని ఉంచారు. పార్కులు, షాపింగ్‌మాల్స్, ఫుట్‌పాత్ వంటి ప్రదేశాల్లో 192 పర్సులను పడవేసి సర్వే నిర్వాహకులు చాటుగా గమనించారు. ఇందులో కేవలం 90 పర్సులు మాత్రమే వెనక్కు వచ్చాయని రీడర్స్ డెజైస్ట్ మేగజైన్ నిర్వహించిన సర్వే పేర్కొంది. హెల్సింకీలో 12 పర్సులను వివిధ ప్రదేశాల్లో జారవిడవగా, అందులో 11 వెనక్కు వచ్చాయి. ముంబైలో 12 పర్సులకుగాను తొమ్మిది వెనక్కు వచ్చాయి. మూడో నిజాయితీగల నగరానికి వస్తే, న్యూయార్క్.. బుడాపెస్ట్‌ల మధ్య టై ఏర్పడింది. ఈ రెండు నగరాల్లో 12 పర్సులకుగాను 8 వెనక్కు వచ్చాయని సర్వే వెల్లడించింది. ఇక చివరి స్థానంలో నిలిచిన లిస్బన్‌లో 12 పర్సులకు కేవలం ఒకటే వెనక్కు వచ్చింది.

మరిన్ని వార్తలు