ముషార్రఫ్‌ సంచలన ఆరోపణలు

21 Sep, 2017 19:31 IST|Sakshi
ముషార్రఫ్‌ సంచలన ఆరోపణలు

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు, నియంత పర్వేజ్‌ ముషార్రఫ్‌ పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ పాకిస్థాన్‌ సహ చైర్మన్‌ అసిఫ్‌ అలీ జర్దారీపై సంచలన ఆరోపణలు చేశారు. జర్దారీ భార్య బెనజీర్‌ భుట్టో హత్యలో జర్దారీకి కూడా భాగస్వామ్యం ఉందని, ఆమె హత్యకు అసిఫ్‌ అలీ జర్దారీ హస్తం ఉందన్నారు. ఆమె సోదరుడు ముర్తాజ భుట్టో చావుకు కూడా జర్దారీ కారణం అన్నారు. రావల్పిండిలో 2007 డిసెంబర్‌ 27న బెనజీర్‌ భుట్టోపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె మృత్యువాత పడ్డారు. అయితే, ఆగస్టు 31న యాంటీ టెర్రరిజం కోర్టు ముషార్రఫ్‌ పాత్ర కూడా ఈ హత్యలో ఉందంటూ ఆరోపించింది.

అదే సమయంలో సాక్ష్యాధారాలు లేవని ఓ ఐదుగురు నిందితులను విడిచిపెట్టింది. ఇక బెనజీర్‌ భుట్టో ప్రధానిగా ఉన్న సమయంలోనే ఆమె సోదరుడు ముర్తాజా 1996లో కరాచీలో హత్యకు గురయ్యారు. ఆ హత్య ఆమె ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ముషార్రఫ్‌ భుట్టో కుటుంబానికి సంబంధించి మాట్లాడుతూ ’భుట్టో కుటుంబంలో జరిగిన దుర్ఘటనలన్నింటికి ఒక వ్యక్తే కారణం అదే జర్దారీ. బెనజీర్‌ భుట్టో, ఆమె సోదరుడు ముర్తాజా భుట్టో హత్యకు కారణం జర్దారీనే’ అంటూ ఆయన భుట్టో జర్దారీ ముగ్గురు పిల్లలకు వీడియో ద్వారా ఈ సందేశం చెప్పారు. భార్య చనిపోయినా ఏమీ పట్టించుకోని జర్దారీ పదవీ కాలాన్ని మాత్రం ఐదేళ్లపాటు దర్జాగా అనుభవించారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు