మష్రూమ్‌ కాఫీతో మరింత ఆరోగ్యం

2 Apr, 2018 21:07 IST|Sakshi

కాఫీ ప్రియులకు శుభవార్త

ఘుమ ఘుమలాడే వేడి వేడి కాఫీ కడుపులో పడందే మంచం దిగడానికి మనసొప్పదు. ఓ నాలుగు సిప్పులు జుర్రుకున్నాకే నిద్రమత్తు వదిలేది. అతిగా కాఫీ అలవాటు ఎసిడిటీకి దారితీస్తుందనీ, కాఫీలో ఉండే కెఫెన్‌ అనే పదార్థం ఆరోగ్యానికి కీడు చేస్తుందనీ నిపుణులు తేల్చారు. ఇక షుగర్‌ పేషెంట్స్‌ విషయమైతే చెప్పక్కర్లేదనుకోండి. అయినా సరే ఆ కాఫీ పై ఆశచావదు కదా?  అందుకే కాఫీ తాగేందుకు ముందూ వెనకా ఆలోచంచే కాఫీ ప్రియులకు ఓ శుభవార్త. కాఫీ అంటే పడిచచ్చేవారికోసం ఇప్పుడు మార్కెట్లో మష్రూమ్‌ కాఫీ ఉవ్విళ్లూరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రియులను ఆకర్షిస్తోంది. పుట్టగొడుగులతో కాఫీయా అని ఛీ కొట్టకండి మరి. ఇప్పుడదే ఆరోగ్యానికి కీడు చేయని కాఫీ అంటున్నారు. బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ని అదుపులో ఉంచడం దీని ప్రత్యేకతట. అలాగే రాత్రిళ్ళు కాఫీ తాగాలంటే నిద్రకు దూరమౌతామేమోనని కూడా సంకోచించాల్సిన అవసరం లేదంటున్నారు. అతి తక్కువ కెఫెన్‌ ఉండడమే అందుకు కారణమని చెపుతున్నారు. నిజానికి మంచినిద్రకు మష్రూమ్‌ కాఫీ దోహదం చేస్తుందట. 

తక్కువ కొలెస్ట్రాల్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే మష్రూమ్‌ కాఫీ రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా పనిచేస్తుందనీ, గుండె సంబంధిత ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందనీ, షుగర్‌ లెవల్స్‌ని కూడా సమతూకంలో ఉంచుతుందనీ మష్రూమ్‌ కాఫీని పొగిడేస్తున్నారు. నిజానికి మష్రూమ్‌ కాఫీ మన శరీరానికి చేస్తున్న మేలు గురించి సైంటిఫిక్‌గా రుజువు కాలేదు. కానీ మష్రూమ్, కాఫీ మేలు కలయికతో ఏర్పడిన మష్రూమ్‌ కాఫీ ఆరోగ్యానికి మంచే చేస్తుందన్నది వీరి వాదన. ప్రధానంగా మష్రూమ్స్‌తో లిప్‌స్టిక్, పెర్‌ఫ్యూమ్స్‌లాంటి దాదాపు వందకు పైగా రకాల ఉత్పత్తులను తయారుచేస్తోన్న మలేషియాలో ఈ మష్రూమ్‌ కాఫీ ఉత్పత్తి అధికంగా జరుగుతోంది. గతంలో కర్నాటకలో విసృతంగా దొరికే వక్కలతో కూడా కాఫీ తయారీ కోసం ప్రయత్నం కర్నాటకలో జరిగింది. అయితే యిప్పుడు ప్రపంచవ్యాప్తంగా మష్రూమ్‌ కాఫీ గురించే చర్చిస్తున్నారు కాఫీప్రియులంతా.

మరిన్ని వార్తలు