స్టార్‌బక్స్‌ నిర్వాకం.. ముస్లిం మహిళ ఆగ్రహం

8 Jul, 2020 17:34 IST|Sakshi

వాషింగ్టన్‌: జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఉదంతం తర్వాత అమెరికాలో జాత్యంహకారానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయిన సంగతి తెలిసిందే. అయినప్పటకి కూడా అక్కడ ఇంకా కొంత మందిలో మార్పు రావడం లేదంటున్నారు నెటిజనులు. తాజాగా స్టార్‌బక్స్‌లో జరిగిన ఓ సంఘటన చూస్తే.. ఇది నిజమనిపిస్తుంది. కాఫీ కప్పు మీద ముస్లిం మహిళ పేరును ‘ఐసిస్’‌ అని రాసి విమర్శలు ఎదుర్కొంటోంది స్టార్‌బక్స్‌ యాజమాన్యం. వివరాలు.. ఆయేషా అనే ఓ ముస్లిం మహిళ ఈ నెల 1న అమెరికాలోని మిన్నెసోటా సెయింట్‌ పాల్‌లోని స్టార్‌బక్స్‌ బరిస్టాలో కాఫీ ఆర్డర్‌ చేసింది. తీరా కాఫీ  కప్పు అందుకున్న ఆమె ఒక్క క్షణం షాక్‌కు గురయ్యింది. ఎందుకుంటే స్టార్‌ బక్స్‌ సిబ్బంది ఆయేషా పేరుకు బదులుగా ‘ఐసిస్’‌ అని కాఫీ కప్పు మీద రాశారు. (ఇక నుంచి ‘గ్లో అండ్ లవ్లీ’)

దీని గురించి ఆయేషా మాట్లాడుతూ.. ‘ముఖానికి మాస్క్‌ ఉండటంతో సరిగా వినపడదనే ఉద్దేశంతో నా పేరును చాలా సార్లు రిపీట్‌ చేశాను. అయినా వారు ‘ఐసిస్’‌ అని రాశారు. ఆయేషా అనే పేరు కొత్త కాదు. తరచుగా వినే పేరే. కావాలనే వారు ఇలా చేశారు. కప్పు మీద ఐసీస్‌ అని చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. అవమానంగా భావించాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల ప్రతిష్టను దిగజార్చే సంఘటన. ఈ రోజుల్లో కూడా జనాల ప్రవర్తన ఇలా ఉందంటే నాకు నమ్మశక్యంగా లేదు. ఇది సరైంది కాదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆయేషా. అంతేకాక దీని గురించి మేనేజర్‌ను ప్రశ్నించింది. వారు ఈ సంఘటనను చిన్న తప్పిదంగా పరిగణించారు. ఆయేషాకు మరో కప్పు కాఫీ, 25 డాలర్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ ఈ చర్యలు ఆమె కోపాన్ని తగ్గించలేకపోయాయి. (హారియట్‌ టబ్‌మన్‌ బానిసల ప్రవక్త)

దాంతో ఆయేషా స్టార్‌బక్స్‌ షాప్‌ మీద డిస్క్రిమినేషన్‌ సూట్‌ దాఖలు చేసింది. దాంతో సదరు షాప్‌ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని తెలిపింది. ‘ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నాం. అయితే ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని మా నమ్మకం. ఇక మీదట ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము. ఇందుకు కారణమైన సిబ్బంది మీద చర్యలు తీసుకుంటాము’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు