-

బాస్ నా జీవితం నాశనం చేశాడు..

28 Nov, 2015 23:09 IST|Sakshi
బాస్ నా జీవితం నాశనం చేశాడు..

భారత మహిళ.. ముంబైకి చెందిన ఫరీదా బేగం ఇప్పుడు దుబాయ్ లో అష్ట కష్టాలు పడుతోంది. యజమాని పాస్ పోర్ట్ విషయంలో చేసిన మోసంతో... చేయని నేరానికి శిక్ష అనుభవిస్తోంది. ఇప్పటికే తనకు పడిన సుమారు ఐదున్నర లక్షల రూపాయల  జరిమానాతో ఆమె తిరిగి ఇండియా రాలేక, అక్కడ మరో ఉద్యోగం దొరికే అవకాశం లేక ఆందోళనలో ఉంది.  కాస్మెటిక్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా.. శిక్షణ పొందిన బ్యూటీషియన్ గా ఫరీదా బేగం 45 వేల రూపాయల జీతంతో ఉద్యోగానికి మే , 2014  లో దుబాయ్ వెళ్ళింది. అప్పట్లో రెసిడెన్స్ వీసా కోసం ఆమె ఓ మెడికల్ టెస్ట్  కూడ చేయించుకున్నట్లు చెబుతోంది. కానీ ఆమె  వీసా దరఖాస్తు అధికారికంగా అమల్లోకి రాలేదు.

'' నేను ఇమిగ్రేషన్ కోసం వెళ్ళాను. నా ఎంట్రీ పర్మిట్ గతేడాది జూన్ 26 న ముగిసి పోయిందని, అప్పటినుంచీ జరిమానా మొదలైందని చెప్పారు. అంతకు ముందే నా పాస్ పోర్ట్ పై  వీసా స్టాంపింగ్ అయి ఉండాలి. కానీ కాలేదు. నేనెప్పుడు అడిగినా నా యజమాని ఏవో సాకులు చెప్పేవాడు. చివరికి ఇప్పుడు అతడిపై పోలీస్ కేస్ పెట్టి, లేబర్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశాను. నాకు ఫేవర్ గా కోర్టు, పోలీసులు ఉన్నప్పటికీ అతను పెద్దగా భయపడటం లేదు.'' అంటోంది బాధితురాలు ఫరీదా. ''ఉద్యోగం క్రమబద్ధీకరిస్తాడన్న ఆశతో నేను మూడు నెలల పాటు జీతం కూడ లేకుండా ఉద్యోగం చేశాను. ఓరోజు షాప్ కు వెళ్ళేసరికి మూసి వేసి పారిపోయాడని తెలిసి షాకయ్యాను. ఆ తర్వాత నా ఫోన్ కాల్ కి ఆన్సర్ చేయడం కూడ మానేశాడు. నాకు రెండున్నర లక్షల దాకా జీతం ఇవ్వాలి. అంతేకాదు నేను అరెస్టయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నా జీవితం, నా భవిష్యత్తు రోడ్డున పడ్డాయి'' అంటూ ఫరీదా ఆవేదన చెందుతోంది.

సంవత్సరం పాటు దుబాయ్ లో అక్కడక్కడా తల దాచుకున్న ఫరీదా బేగం, ఇటీవలే ఓ ఇండియన్ ఫ్యామిలీ ఇచ్చిన ఆశ్రయం పొందుతోంది. ఇప్పుడు మరో ఉద్యోగానికి అవకాశం వచ్చినా సరైన వీసా  లేక అవకాశాన్ని కోల్పోతోంది. ఇండియా వచ్చినా తనకు ఎవ్వరూ లేరని, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో, ఉన్న ఇంటిని కూడ అమ్మి దుబాయ్ వెళ్ళిన తాను ఇండియా వచ్చే అవకాశం కూడ లేదని చెప్తోంది. దుబాయ్ లో భారత్ కాన్సులేట్ జారీ చేసిన తాత్కాలిక పాస్ పోర్ట్  కూడ సెప్టెంబర్ 2016 నాటికి గడువు ముగిసిపోతుంది. దిక్కు తోచని స్థితిలో ఉన్న తనకు తగిన సహాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఫరీదా బేగం దీనంగా వేడుకుంటోంది.

మరిన్ని వార్తలు