'విమానం ఢీకొట్టిన అంతస్తుపైనే నాన్న'

11 Sep, 2016 17:29 IST|Sakshi
'విమానం ఢీకొట్టిన అంతస్తుపైనే నాన్న'

న్యూయార్క్: సెప్టెంబర్, 11, 2001. ఆ రోజు అమెరికా చరిత్రలోనే చెరిగిపోని మచ్చ. మరిచిపోలేని ఓ పీడకల. తలుచుకుంటేనే బాధితులకే కాకుండా అమెరికన్లందరికి అమ్మో అని గుండెలను తడుముకునేలా చేసిన ఓ భయంకర సంఘటన. అదే ట్విన్ టవర్స్ బ్లాస్ట్. అమెరికాలోని ప్రముఖ రెండు వాణిజ్య సముదాయాలపై ఉగ్రవాద సంస్థ అల్ ఖాయిదా విమానాలను హైజాక్ చేసి మరి దాడి చేసిన సందర్భం. ఈ ఘటనలో 3000మందికి పైగా చనిపోగా ఎంతోమంది తీవ్ర గాయాలపాలయ్యారు.

ఆ సమయంలో ఊపిరి బిగపట్టుకొని ఉత్కంఠగా తమవారి జాడకోసం ఎదురుచూసిన వారు ఎందరో.. అలాంటి వారిలోనే ఆ సమయంలో పదకొండేళ్ల ప్రాయంలో ఉన్న ఓ అమ్మాయి తన తండ్రిని కోల్పోయింది. ఈ ఘటన జరిగి దాదాపు నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా క్రిస్టినా రాంకే అనే అమ్మాయి తన తండ్రిని కోల్పోయిన తీరు, ఆ సమయంలో ఆ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితి ఓసారి ఆమె మాటల్లోనే చూస్తే..

'9/11న జరిగిన సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడే 15 ఏళ్లు గడిచిపోయాయని అనుకుంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈ సంఘటన జరిగినప్పుడు నాకు 11 ఏళ్లు. మా నాన్న దాడికి గురైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోని దక్షిణ టవర్ లో ఉద్యోగం చేసేవారు. మేమంతా జిమ్ లో ఉండగా కొంతమంది వచ్చి మా స్కూల్ ఆఫీసుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత జరిగిన విషయం చెప్పారు. నన్ను ఇంటికి తీసుకెళ్లగా అంతా టీవీల ముందు టెన్షన్ గా ఉన్నారు. టవర్లు తగలబడిపోతున్న దృశ్యాలు నా కళ్లకు టీవీలో కనిపించాయి. అవి ఇప్పటికీ నా కళ్లలోనే కనిపిస్తాయి. 3000మంది చనిపోయారు. ఆ సమయంలో నాకు ఆ విషయం తెలియదు. అందులోనే పనిచేస్తున్న నాన్న కనిపించడం లేదని తెలిసింది. అమ్మకు దిగులు మొదలైంది. ఎన్ని ఆస్పత్రులకు పరుగులు పెట్టి నాన్న కోసం గాలించిందో లెక్కే లేదు. ఆ రోజు అమ్మకష్టం అంతాఇంత కాదు. మా చుట్టూ అప్పుడు ఎన్నో ప్రశ్నలు. చివరకు మా దురదృష్టంకొద్ది ఆయన మృతదేహం కూడా లభ్యంకాని పరిస్థితి. ఆ ప్రమాదంలో నాన్న లేడు తిరిగొస్తాడని ఎదురుచూశాం. నాలుగు నెలల తర్వాత ఆయన ఇక లేనట్లేనని నిర్ణయానికి వచ్చాం. నా మిత్రులను కూడా ఎంతోమందిని పోగొట్టుకున్నాను. అమ్మ ప్రతి రోజు ఏడుస్తుండేది. అది నాపై చాలా ప్రభావం పడింది. మా నాన్నకు నేను చాలా ఇష్టం. ఓ ఉగ్ర విమానం ఢీకొట్టిన ఎత్తయిన అంతస్తులో పనిచేసేవారు. నన్ను కొన్నిసార్లు తీసుకెళ్లారు. అప్పుడప్పుడు సరదాగా లిఫ్ట్లో చివరి వరకు వెళ్లే వాళ్లం. ఆయనకు సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి. నా కుటుంబంలో నేనే పెద్దదాన్ని అయినందున ఏదో ఒకటి కుటుంబం కోసం చేయాలని అనుకున్నాను. ప్రస్తుతం వెంచర్ క్యాపిటలిస్టుగా పనిచేస్తున్నాను. 9/11 ఘటన బారిన పడ్డ బాధితుల కుటుంబాల్లోని పిల్లల విద్యావకాశాలకు కూడా నేను కృశిచేస్తున్నాను. ఇది నాకు చాలా ముఖ్యమైనది కూడా' అంటూ క్రిస్టినా చెప్పుకొచ్చింది.

(చిన్నప్పుడు తండ్రితో క్రిస్టినా రాంకే(ఫైల్))

మరిన్ని వార్తలు