ఐసీజే పోరులో భారత్‌ గెలుపు

22 Nov, 2017 01:28 IST|Sakshi
ఐసీజేలో జడ్జిగా ఎన్నికైన జస్టిస్‌ భండారీకి అభినందనలు చెబుతున్న ఐరాస ప్రతినిధి

అంతర్జాతీయ కోర్టు జడ్జిగా మరోసారి ఎన్నికైన భండారీ

చివరి క్షణంలో పోటీ నుంచి వైదొలగిన బ్రిటన్‌

భారత్‌కు సాధారణ సభలో 183, మండలిలో అన్ని దేశాల మద్దతు

ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్‌ అతి పెద్ద దౌత్య విజయం

ఈ ఘనత సుష్మా స్వరాజ్, విదేశాంగ శాఖదే: ప్రధాని మోదీ

ఐక్యరాజ్యసమితి: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) న్యాయమూర్తిగా భారత్‌కు చెందిన జస్టిస్‌ దల్వీర్‌ భండారీ మరోసారి ఎన్నికయ్యారు. హోరాహోరీగా సాగుతుందనుకున్న పోటీ నుంచి మంగళవారం బ్రిటన్‌ తప్పుకోగా.. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ, భద్రతా మండలిలు భండారీకి పూర్తి మద్దతు ప్రకటించాయి. దీంతో ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్‌ అతి పెద్ద దౌత్య విజయం సాధించినట్లైంది. ఐరాస సాధారణ సభలో మొత్తం 193 ఓట్లకు గాను 183, భద్రతా మండలిలోని మొత్తం 15 ఓట్లనూ భండారీ దక్కించుకున్నారు. ఐరాసలోని ఆధిపత్య దేశాలకు భండారీ విజయం గట్టి సందేశం పంపిందని, భారత్‌ శక్తివంతమైన దేశమనే అభిప్రాయం కలిగేలా చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

నెదర్లాండ్స్‌లోని హేగ్‌ నగరంలో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ ఏడాది ఐదు స్థానాలు ఖాళీ కాగా నాలుగింటికి ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. మరొకస్థానానికి దల్వీర్‌ భండారీ, బ్రిటన్‌కు చెందిన క్రిస్టోఫర్‌ గ్రీన్‌వుడ్‌లు సాధారణ సభ, భద్రతా మండలిలో 11 రౌండ్లు హోరాహోరీగా తలపడ్డారు. మొత్తం 11 రౌండ్లలోను సాధారణ సభలో భండారీ మూడింట రెండింతల ఆధిక్యం సాధించగా, భద్రతా మండలిలో గ్రీన్‌వుడ్‌ మెజార్టీలో కొనసాగారు.

మంగళవారం(భారత కాలమానం) 12వ రౌండ్‌ ఎన్నికలు జరగాల్సి ఉండగా గంట ముందు పోటీ నుంచి బ్రిటన్‌ వైదొలగింది. దీంతో భండారీ ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ విజయంతో ఆయన మరో 9 ఏళ్ల కాలానికి ఐసీజే న్యాయమూర్తిగా పనిచేయనున్నారు. హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో మొత్తం 15 మంది న్యాయమూర్తులుండగా.. ప్రతీ మూడేళ్లకు ఐదుగురిని ఎన్నుకుంటారు.  

రాజీ ప్రయత్నం విఫలం
సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు (అమెరికా కాలమానం) ఐరాస సాధారణ సభ, భ ద్రతా మండలిలు సమావేశం కావాల్సి ఉండ గా అనూహ్యంగా పోటీ నుంచి వైదొలుగుతు న్నట్లు బ్రిటన్‌ శాశ్వత ప్రతినిధి మాథ్యూ రైక్రాఫ్ట్‌ లేఖ రాశారు. తర్వాతి రౌండ్లలో కూడా ప్రతిష్టంభన తొలగేలా లేదని, కాలయాపన ఇష్టంలేక గ్రీన్‌వుడ్‌ నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

నిర్ణయం తీసుకునే ముందు భారత్, బ్రిటన్‌ మధ్య సన్నిహిత సంబంధాల్ని దృష్టిలో పెట్టుకున్నామని, భవిష్యత్తులో కూడా అవి అలాగే కొనసాగుతాయని మాథ్యూ చెప్పారు. ఓటింగ్‌కు 3 గంటల ముందు సాధారణ సభ అధ్యక్షుడు మిరోస్లవ్‌ లాజ్‌కాక్, భద్రతా మండలి అధ్యక్షుడు సెబాస్టియనో కార్డిలు భారత్, బ్రిటన్‌ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఎలాంటి ఒత్తిడికి తలొగ్గమని, ఎన్నికను ప్రజాస్వామ్య పద్ధతిలో జరపాలని భారత్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. ఏ కారణంతో బ్రిటన్‌ పోటీ నుంచి వైదొలగిందనేది మాత్రం స్పష్టంగా తెలియలేదు. ఫలితాలు వెలువడగానే ఐరాస సాధారణ సభలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ను ఇతర దేశాల ప్రతినిధులు అభినందించారు.  

ట్వీటర్‌లో మోదీ అభినందనలు
భండారీ గెలుపు ఘనత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, విదేశాంగ శాఖకు దక్కుతుందని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘ఐసీజేకు భారత్‌ మళ్లీ ఎన్నికయ్యేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మొత్తం విదేశాంగ శాఖ బృందానికి అభినందనలు. భండారీ ఎన్నిక దేశానికి గర్వకారణం’ అని పేర్కొన్నారు. ‘వందేమాతరం, అంతర్జాతీయ న్యాయస్థానం ఎన్నికలో భారత్‌ గెలుపొందింది. జైహింద్‌’ అని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు గ్రీన్‌వుడ్‌పై దల్వీర్‌ విజయం తమ దేశానికి అవమానకర పరిణామమని బ్రిటన్‌ మీడియా పేర్కొంది.


హైకోర్టు టు ఐసీజే
తాత, తండ్రి బాటలోనే దల్వీర్‌ భండారీ కూడా న్యాయవాద వృత్తినే ఎంచుకున్నారు. అక్టోబర్‌ 1, 1947లో జైన కుటుంబంలో జన్మించిన ఆయన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో బీఏ చేశాక లా పట్టభద్రుడయ్యారు. 1968లో రాజస్తాన్‌ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 1970 జూన్‌లో వచ్చిన అవకాశం ఆయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. భారత చట్టాలపై పరిశోధనకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానమందింది.

అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌ కూడా లభించింది. షికాగోలోని మరో విశ్వవిద్యాలయం నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీలో ‘మాస్టర్‌ ఆఫ్‌ లా’ చదివేందుకు మరో స్కాలర్‌షిప్‌ వరించింది. 1973లో న్యాయ సహాయ కార్యక్రమాల అమలుపై పరిశీలన, ప్రసంగాల కోసం భండారీకి ఫెలోషిప్‌ లభించింది. థాయిలాండ్, మలేసియా, ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంకల్లో పర్యటించి అంతర్జాతీయ చట్టాలు, అమలుపై విస్తృత అనుభవం సంపాదించారు. ‘ఇండియాలో నేర శిక్షాస్మృతి అమలులో జాప్యం’ అనే ఐక్యరాజ్యసమితి ప్రాజెక్టుకు కూడా భండారీ విశేష సేవలందించారు.

2012లో తొలిసారి ఎన్నిక
1977లో జైపూర్‌ నుంచి ఢిల్లీకి మకాం మార్చిన భండారీ ఢిల్లీ హైకోర్టులో పదమూడేళ్లు న్యాయవాదిగా చేశారు. 1991లో అదే కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004లో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2005లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

సుప్రీం న్యాయమూర్తిగా పదవీ విరమణకు కొన్ని నెలల ముందు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక జడ్జి రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీ భర్తీకి భారత్‌ భండారీ పేరును ప్రతిపాదించింది. 2012 ఏప్రిల్‌ 27న ఐసీజే ఎన్నికల్లో ఫిలిప్పీన్స్‌ అభ్యర్థి ఫ్లారెంటినో ఫెలిషియానోను భండారీ ఓడించారు. భారత ప్రభుత్వం ఆయనను 2014లో పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. 2018 ఫిబ్రవరిలో ఐసీజే న్యాయమూర్తిగా ఆయన రెండో విడత పదవీకాలం మొదలవుతుంది.

మరిన్ని వార్తలు