రోడ్డుపై ఉన్న హిజ్రా... నేను ఒక్కటే

27 Mar, 2018 17:42 IST|Sakshi
ట్రాన్స్‌జెండర్స్‌ మార్వియ మాలిక్‌

సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటిలో మనిషిది ప్రత్యేక స్థానం. మనుషుల్లో ఆడ, మగ అని...ఇవి రెండు మాత్రమే సహజ సిద్ధమైనవనీ... ఆడ, మగ కాకుండా మూడో రకాన్ని ఈ సమాజం చిన్న చూపు చూడటం జరుగుతోంది. సగం ఆడ, సగం మగ లక్షణాలతో ఉన్న వారి పట్ల లోకువే ఈ లోకానికి. మారుతున్న కాలంలో గే, లెస్బియన్స్‌, ట్రాన్స్‌జెండర్స్‌ అంటూ కొత్త లక్షణాలు వస్తున్నాయి. వీటన్నింటిని సమాజం అంగీకరించాలి. ఎందుకంటే వారు మనుషులే కదా. పాకిస్థాన్‌లో మొదటిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌.. న్యూస్‌ యాంకర్‌ స్థాయికి ఎదిగింది. తను ఆస్థాయికి ఎదిగిన ప్రయాణాన్ని, ఎదురైన కష్టాలను ఎదురొడ్డిన తన అనుభవాల్ని పంచుకుంది.

అయితే తను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను పడాల్సి వచ్చిందనీ, తను చదువుకునే సమయంలో సెలూన్‌లో పనిచేస్తుండగా తనను గెంటేశారనీ, చేతి ఖర్చులకు కూడా తనవద్ద డబ్బులుండేవి కావనీ, అలాంటి సమయంలో రోడ్డుపై యాచిస్తూ ఉండే హిజ్రాలకు నాకు తేడా లేదనిపించిందంటూ తను పడిన వేదనను వివరించింది.

మార్వియ మాలిక్‌ పాకిస్థాన్‌లో న్యూస్‌ యాంకర్‌ అయిన మొదటి ట్రాన్స్‌జెండర్‌. శనివారం మార్వియ చదివిన న్యూస్ బులిటెన్ వైరల్ అయ్యింది. దీంతో తనకు పాజిటివ్‌ కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. జరా చంగేజీ అనే ట్రాన్స్‌జెండర్‌ గొప్ప నటిగా గుర్తింపు పొందిన తరువాత, పాకిస్థాన్‌ సెనేట్‌ వీరిని కూడా మూడో జెండర్‌గా గుర్తించింది. డ్రైవింగ్‌ లైసెన్సులపై ఎక్స్‌(x) జెండర్‌గా ముద్రిస్తున్నారు.

మొదటిసారిగా 2009లో పాక్‌ సుప్రీంకోర్టు మూడో జెండర్‌ను ఎక్స్‌(x) జెండర్‌గా గుర్తించడం జరిగింది. గతేడాది పాక్‌ ప్రభుత్వం మొదటిసారిగా ట్రాన్స్‌జెండర్‌ కేటగిరిలో పాస్‌పోర్ట్‌ను ఇచ్చింది. పైగా గతేడాది మొదటిసారిగా జనాభా లెక్కల్లో వీరిని కూడా చేర్చింది. దేశంలో 10,418 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్లు పేర్కొంది పాక్‌ ప్రభుత్వం.

మరిన్ని వార్తలు