-

ఆ గ్రామాన్ని వేధిస్తున్న మిస్టరీ ఏంటి?

19 Feb, 2016 09:57 IST|Sakshi
ఆ గ్రామాన్ని వేధిస్తున్న మిస్టరీ ఏంటి?

కజకిస్తాన్: అది కజకిస్తాన్లోని బెరిజోవాకా అనే చిన్న గ్రామం. ఏళ్ల తరబడి నరకప్రాయం అనుభవిస్తోంది. అక్కడ ఎందుకు అలా జరగుతుందో ఇప్పటికీ అంతుబట్టడం లేదు. ఎవరూ గుర్తించలేని ఓ భయంకర వ్యాధి వారిని పట్టి పీడిస్తోంది. అది కూడా అతి నిద్ర వ్యాధి. వారు ఒక్కసారి నిద్రపోయారంటే మళ్లీ ఎప్పుడు లేస్తారో చెప్పలేని పరిస్థితి. వారు చనిపోయారా నిద్రలో ఉన్నారా కూడా గుర్తుపట్టలేని వైనం.

ఫలితంగా దాదాపు 1,500 మంది ప్రజలు ఆ గ్రామాన్ని ఏదో శాపంపట్టిపీడిస్తోందని అపనమ్మకంతో ఖాళీ చేసి వెళ్లిపోయారు. ముఖ్యంగా ఈ వ్యాధి వల్ల వారికి అనుహ్యంగా మూర్చ రావడం, కళ్లు మసకగా అయిపోవడం, కడుపులో భయంకరంగా తిప్పడం వెంటనే కుప్పకూలిపోవడం వంటి లక్షణాలు వారిని పీడిస్తున్న 'స్లీపీ హాలో' అనే జబ్బు చూపిస్తున్న ప్రతిచర్యలు. ఇదంతా ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి యుక్తవయసులో ఉన్నవారికి వస్తుండటం వారిని వణికిస్తోంది.

పాఠశాల కోసం తమ చిన్నారులను సిద్ధం చేసి పంపిస్తే వారు అనూహ్యంగా బెంచీల్లోనే శవాలమాదిరిగా కుప్పకూలినట్లు పడిపోయి సుధీర్ఘ నిద్రలోకి వెళ్లిపోవడం రోజుల తరబడి కిక్కురుమనకుండా ఉండిపోతుండటంతో వారికి ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితి. దీంతో ఆ గ్రామానికి పదిహేను మైళ్ల దూరంలో ఉన్న అక్సాయి అనే గ్రామంలోకి తరలి వెళ్లారు. అయినా వారి పరిస్థితి మారలేదు. వారంలో రెండుసార్లయినా ఆపిల్లలు అలా మత్తులో మునిగిపోతున్నారు.

అయితే, బెరిజోవాకా అనే గ్రామంలో విష వాయువుల ప్రభావం అమితంగా ఉందని, కరచగనాక్ పెట్రోలియం ఆపరేటింగ్ పవర్ స్టేషన్ ఆ గ్రామానికి సమీపంలో ఉండి అది అనేక విషవాయువులు విడుదల చేస్తుందని ఫలితంగానే పిల్లలు అనూహ్య రోగాల బారిన పడుతున్నట్లు ఆ గ్రామస్తులు చెప్తుండగా ప్రభుత్వ అధికారులు మాత్రం అక్కడ పరీక్షలు నిర్వహించి అలాంటిదేం లేదని అంటున్నారు. మరింతకీ ఆ పిల్లలను వేధిస్తున్న ఆ మహమ్మారి ఏంటనేది ముందురోజుల్లో తెలుస్తుందేమో చూడాలి.

మరిన్ని వార్తలు