గులాబీ రంగు మంచు.. పర్యాటకుల ఆందోళన

6 Jul, 2020 10:12 IST|Sakshi

రోమ్‌: 2020 అంటేనే ప్రజల్లో భయం పుడుతోంది. ఎన్నో భయంకరమైన సంఘటనలు ఈ ఏడాదిలోనే చోటు చేసుకుంటున్నాయి. గతేడాది డిసెంబర్‌లో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచమంతా కోరలు చాస్తున్న తరుణంలో 2020లో యుగాంతం అంటూ ఇటీవల పుకార్లు పుట్టుకొచ్చాయి. ఊహించని ఎన్నో భయంకర సంఘటనలతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ తరుణంలో ఇటలీలోని ఆల్ప్స్‌ పర్వతాల్లో గులాబీ రంగులోకి మారిన మంచును చూసి అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ అని, ఎటువంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘వేగంగా మంచు కరగడం వల్ల ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి. మంచు ఆల్గేలు వేడిని గ్రహించి హిమనదిని త్వరగా కరిగిస్తాయి. వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పడానికి గులాబి మంచు ఉదాహరణ’ అని ఇటలీ నేషనల్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ శాస్త్రవేత్త బియాజియో డి మౌరో పేర్కొన్నారు.

‘సాధారణంగా మంచు సూర్యుని రేడియేషన్‌ 80 శాతానికి పైగా ఉన్నపుడు వాతావరంలో తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. కానీ ఆల్గే మాత్రం మంచును డార్క్‌ చేయడంతో మంచు వేడెక్కి తొందరగా కరుగుతుంది. మంచు మరింత వేగంగా కరుగుతున్నప్పుడే ఇటువంటి ఆల్గేలు కనిపిస్తాయి. తద్వారా పొసోగావియా వద్ద 8,590 అడుగుల ఎత్తులో ఉన్న తెల్లటి మంచు ఇలా వివిధ రంగుల్లోకి మారుతుంది. ఇలాంటి సంఘటన ఇప్పటికే స్విట్జర్లాండ్‌లో చోటుచేసుకుంది. దీనిపై గతంలో అధ్యయనం చేశాం. ఆల్గే ప్రమాదకరమైనది కాదు. ఇది వసంత రుతువుకు, వేసవి కాలం మధ్య ధ్రువాల వద్ద సంభవించే సహజమైన మార్పు’ అని బియాజియో చెప్పుకొచ్చారు.

మనుషులు చేసే తప్పిదాల వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, మంచు కరగడానికి సూర్యుడి వేడితో పాటు మంచుపై హైకర్‌తో పాటు స్కై లిఫ్టులు చేయడం కూడా ప్రధాన కారణమని డీ మౌరో అభిప్రాయపడ్డారు. మంచు గులాబీ రంగులోకి మారడంతో అక్కడి పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ‘భూమి వేడెక్కడమనేది పెద్ద సమస్య.. అందులో చివరిది ఆల్గే’ అని ‘మనం కోలుకోలేని స్థితిలో ఉన్నాము. ఇక ఎప్పటికీ దీనిని నుంచి బయటపడలేము’, ‘మనం చేసినదే భూమి తిరిగి ఇస్తుంది’, ‘2020 ప్రత్యేకమైనది. ఎన్నో భయంకరమైన సంఘటనలు ఈ ఏడాదిలోనే చోటుచేసుకుంటున్నాయి’ అంటూ పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు