మార్స్‌పై ‘మిస్టీరియస్‌’ రాళ్లకు కారణమేంటో తెలుసా.? 

18 Jun, 2018 22:06 IST|Sakshi

వాషింగ్టన్‌: మార్స్‌ మీద ఉన్న విచిత్ర రాళ్ల ఆచూకీ  తెలిసిందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మార్స్‌పై ఉన్న మెడ్యుసే ఫాసే రాళ్లు అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం వల్ల ఏర్పడినట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. సాధారణంగా అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు  చిన్నచిన్న రేణువుల్లాంటి బూడిద, రాళ్లు, వివిధ రకాల వాయువులు విడుదలవుతాయి. వీటి నుంచే ఈ రాళ్లు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వీటిని 1960ల్లోనే నాసా మారినర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ గుర్తించినప్పటికీ అవి ఎలా ఏర్పడ్డాయో తెలియలేదు. 

తాజాగా ఇవి అగ్నిపర్వతాలు పేలడంతో ఏర్పడ్డాయని తేల్చారు. మార్స్‌ మధ్యరేఖ వద్ద  వీటి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని  జియోఫిజికల్‌ రీసెర్చ్‌ జర్నల్‌లో శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా ఇవి  3 బిలియన్‌ సంవత్సరాల క్రితమే  ఏర్పడి ఉంటాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వీటి విస్తీర్ణం అమెరికా విస్తీర్ణంలో 20 శాతం ఉంటుందని, భూమిమీద ఏర్పడిన భారీ అగ్నిపర్వత విస్ఫోటనాల కంటే కూడా వంద రెట్లు పెద్దవని , సోలార్‌ వ్యవస్థలోనే ఇవి భారీ నిల్వలని జాన్స్‌ హప్‌కిన్స్‌ యూనివర్సిటీశాస్త్రవేత్త లుజాండ్రా ఓజా తెలిపారు. 

మరిన్ని వార్తలు