గోళ్ల రంగు వేసుకుంటే బరువు పెరుగుతారా?

23 Oct, 2015 17:01 IST|Sakshi
గోళ్ల రంగు వేసుకుంటే బరువు పెరుగుతారా?

మీరు తరచు గోళ్లకు రంగులు వేసుకుంటున్నారా? ఏరోజుకు ఆరోజు వేసుకున్న డ్రస్సుకు మ్యాచ్ అయ్యేలా పాత నెయిల్ పాలిష్‌ను రిమూవ్ చేసేసి కొత్తది వేసుకోవడం అలవాటు ఉందా? అయితే.. కాస్తంత జాగ్రత్త. ఎందుకంటే తరచు గోళ్లకు రంగులు వేసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉందని డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకు వాటిలో ఉండే ఓ పదార్థం కారణం అవుతుందట. ట్రైఫీనైల్ ఫాస్ఫేట్ (టీపీహెచ్‌పీ) అనే ఈ పదార్థం వల్ల గోళ్ల రంగులు ఎక్కువ కాలం మన్నుతాయి. ప్లాస్టిక్ పదార్థాలు, ఫోమ్ ఫర్నిచర్‌కు త్వరగా మంటలు అంటుకోకుండా కూడా దీన్ని వాడతారు. గతంలో గోళ్ల రంగుల్లో వేరే పదార్థాలు వాడినప్పుడు పునరుత్పాదకతకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. దాంతో.. దానికి ప్రత్యామ్నాయంగా టీపీహెచ్‌పీని వాడుతున్నారు.

టీపీహెచ్‌పీ అనేది ఎండోక్రైన్ డిజ్రప్టర్ అని, అంటే హార్మోన్లపై దాని ప్రభావం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. పశువుల మీద చేసిన పరీక్షలలో వాటికి సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు తలెత్తాయి. అయితే మనుషులలో మాత్రం కొంతవరకు బరువు పెరుగుతున్నట్లు గుర్తించారు. పరిశోధకులు మొత్తం 3వేల రకాల గోళ్ల రంగులు సేకరించి వాటిని పరీక్షించగా వాటిలో 49 శాతం వాటిలో ఈ పదార్థం ఉంది. కొంతమందైతే అసలు అది ఉన్నట్లు చెప్పకుండానే కలిపేస్తున్నారు. గోళ్ల రంగు వేసుకున్న 10-14 గంటల తర్వాత వాళ్ల శరీరంలోని టీపీహెచ్‌పీ మోతాదు దాదాపు ఏడు రెట్లు పెరిగింది. అయితే కృత్రిమ గోళ్లు పెట్టుకుని, వాటికి మాత్రమే రంగులు వేసుకున్నవాళ్లకు మాత్రం అలా పెరగలేదు. అందువల్ల తరచు గోళ్లరంగులు వేసుకోవడం అంత మంచిది కాదని, దానివల్ల శరీరంలో పలు రకాల మార్పులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. మరీ తప్పనిసరైతే చర్మానికి తగలకుండా చూసుకోవాలని, అలా తగిలితే అది రక్తంలోకి కూడా వెళ్తుందని అంటున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త!

మరిన్ని వార్తలు