పాకిస్థాన్ కుబేరుడు ఎవరో తెలుసా?

22 Apr, 2016 16:39 IST|Sakshi
పాకిస్థాన్ కుబేరుడు ఎవరో తెలుసా?

ఇస్లామాబాద్‌: ఇటీవల పనామా పత్రాల్లో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్ పేరు వెలుగు చూడటం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే దేశంలో అత్యంత సంపన్నులైన రాజకీయ నాయకుల జాబితాను పాకిస్థాన్ ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఊహించినట్టుగానే ఈ జాబితాలో రూ. 200 కోట్ల ఆస్తులతో ప్రధాని షరీఫ్‌ మొదటిస్థానంలో నిలిచారు. గత నాలుగు ఏండ్లలో ఆయన ఆస్తులు రూ. వందకోట్లు పెరిగి రూ. 200 కోట్లకు చేరడం గమనార్హం.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది రాజకీయ నాయకులు తమ ఆస్తులు, అప్పుల వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు 2015లో తాను, తన భార్య ఆస్తుల వివరాలను షరీఫ్‌ వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం విదేశాల్లో ఆయనకు ఎలాంటి ఆస్తులు లేవు. 2011లో రూ. 166 మిలియన్లుగా ఉన్న ఆయన ఆస్తుల విలువ.. 2015కు వచ్చేసరికి ఏకంగా 2 బిలియన్లకు చేరుకుంది. ఆయనకు అత్యధిక మొత్తం విదేశాల్లోని ఆయన కొడుకు హుస్సేన్‌ నవాజ్‌ నుంచే అందుతుండటం గమనార్హం. 2015లో నవాజ్ తండ్రికి రూ. 215 మిలియన్లు పోషక ధనంగా పంపించారు.

పాక్ పార్లమెంటులో అత్యధిక ఆస్తులున్న రాజకీయ నాయకుడిగా షరీఫ్ మొదటి స్థానంలో ఉండగా, ఆయన తర్వాతి స్థానాల్లో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి షాహిద్ ఖాఖాన్‌ అబ్బాసి, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ఎంపీలు ఖయాల్‌ జమన్‌, సాజిద్ హుస్సేన్ ఉన్నారు.  ఇక ప్రధాని షరీఫ్‌ ఆస్తుల్లో ఓ టయోటా లాండ్ క్రూజర్‌ ఉంది. దీనిని గుర్తుతెలియని వ్యక్తులు కానుకగా ఇచ్చారు. అలాగే రెండు మెర్సిడెజ్‌ వాహనాలు కూడా షరీఫ్‌ కలిగి ఉన్నారు. నల్లడబ్బును దాచుకోవడానికి విదేశాల్లో బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసిన రాజకీయ నాయకుల జాబితా షరీఫ్‌ కూడా ఉన్నట్టు పనామా పత్రాలు వెల్లడించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు