ఆఫీస్‌ టైంలో హాయిగా నిద్రపోవడం ఎలా?

24 May, 2018 09:43 IST|Sakshi
 ‘‘నాప్‌ యార్క్‌ ’’

న్యూయార్క్‌, అమెరికా : తీరిక లేని ఉద్యోగ జీవితంలో కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో. ఇంట్లో ఆఫీస్‌ దిగులు. ఆఫీస్‌కు పోతే ఇంటి దిగులు ఇక నిద్రపోవడానికి టైమేది. ఇలా ఆలోచించే వాళ్ల కోసం అమెరికాలో ఓ చక్కటి సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ‘నాప్‌ యార్క్‌ ’, ‘నాప్‌ క్లబ్స్‌’ల పేరిట ఉద్యోగుల్ని హాయిగా నిద్రపుచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి అక్కడి వ్యాపార సంస్ధలు. ఆఫీస్‌ టైంలో బ్రేక్‌ దొరకగానే  రిలాక్స్‌ అవ్వడానికి చాలా మంది ‘టీ’, ‘కాఫీ’ తీసుకుంటారు. కానీ న్యూయార్క్‌ ఉద్యోగులు మాత్రం హాయిగా నిద్రపోవడానికి ఇష్టపడుతున్నారు.

‘నాప్‌ యార్క్‌ ’, ‘నాప్‌క్లబ్స్‌’లు రోజులో 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి కాబట్టి  పగలు, రాత్రి తేడా లేకుండా ఆఫీస్‌ టైంలో బ్రేక్‌ దొరికినపుడు కొంత డబ్బు చెల్లించి ఓ చెక్క గదిలో హాయిగా నిద్రపోవచ్చు. అసలే న్యూయార్క్‌ సిటీలో ప్రశాంతత భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు అందుకే ఉద్యోగులు నాప్‌ క్లబ్స్‌ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. 30 నిమిషాల పాటు సాగే ఈ నిద్ర కోసం 15 డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సంపన్న వ్యక్తులకు, వేల డాలర్ల జీతాలు తీసుకునే వారికి 15 డాలర్లు పెద్ద ఖర్చు కాకపోయిన చిరుద్యోగులకు మాత్రం కొంత కష్టమే. రానున్న రోజుల్లో ఈ సదుపాయం అన్ని దేశాలలో అందుబాటులోకి వస్తుందేమో చూడాలి మరి.

మరిన్ని వార్తలు