టైమ్ జాబితాలో మోదీ, పేటీఎం విజయ్ శర్మ

20 Apr, 2017 19:57 IST|Sakshi
టైమ్ జాబితాలో మోదీ, పేటీఎం విజయ్ శర్మ

టైమ్ పత్రిక ప్రతియేటా ప్రకటించే అత్యంత ప్రభావశీలురైన వంద మంది వ్యక్తులలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మలకు స్థానం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని థెరెసా మే కూడా ఈ జాబితాలో ఉన్నారు. డోనాల్డ్ ట్రంప్ ఇంకా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం పొందుతారా లేదా అన్నది కూడా ఇంకా నిర్ధారణ కాకముందే 2014 మే నెలలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి మోదీ ప్రధానమంత్రి అయ్యారని ఆ ప్రకటనలో చెప్పారు. దాదాపు మూడేళ్ల తర్వాత కూడా మోదీ ప్రభ ఏమాత్రం తగ్గలేదని, ప్రజలను సమ్మోహితులను చేయడంలో ఆయన అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘనవిజయాన్ని కూడా అందులో ప్రస్తావించారు.

ఇక పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ అయితే భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపిస్తున్నారని చెప్పారు. నవంబర్ నెలలో భారత ప్రభుత్వం ఉన్నట్టుండి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు పేటీఎం విజయ్ ఆ అవకాశాన్ని సరిగ్గా అందిపుచ్చుకున్నారని తెలిపారు. 2016 ప్రారంభం నాటికి పేటీఎంకు 12.2 కోట్ల మంది యూజర్లుంటే, సంవత్సరాంతం నాటికి వారి సంఖ్య 17.7 కోట్లకు చేరుకుందని వివరించారు. చిన్న పల్లెటూరి నుంచి వచ్చి హిందీ మీడియంలో చదువుకుని దేశంలో డిజిటల్ ఎకానమీతో సంచలనం సృష్టించారన్నారు. టైమ్స్ పత్రిక ప్రతియేటా విడుదల చేసే 100 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులలో కళాకారులు, వ్యాపారవేత్తలు, నాయకులు.. ఇలా అన్ని వర్గాలకు చెందినవారు ఉంటారు.

మరిన్ని వార్తలు