మా స్నేహం బలమైనది : మోదీ

27 Jul, 2018 15:35 IST|Sakshi
బ్రిక్స్‌ సమావేశంలో నరేంద్ర మోదీ- వ్లాదిమిర్‌ పుతిన్‌

రష్యా అధ్యక్షుడితో నరేంద్ర మోదీ భేటి

జోహన్నెస్‌బర్గ్‌ : రష్యాతో తమ బంధం ఎంతో విలువైనదని, భారత్‌-రష్యా దేశాలు బహుళ రంగాల్లో కలిసి పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో తెలిపారు. బ్రిక్స్‌ సమావేశాల్లో భాగంగా రెండు రోజుల పర్యటనకు మోదీ బుధవారం దక్షిణాఫ్రికా వెళ్లిన విషయం తెలిసిందే. సమావేశంలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో శుక్రవారం భేటి అయ్యారు. ‘రష్యాతో మాకు మంచి అనుబంధం ఉంది. విభిన్న రంగాల్లో మా స్నేహం కొనసాగుతుంది. బహుళ రంగాల్లో రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించాము’ అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. 

ఇరు దేశాల నేతల ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించినట్లు విదేశాంగ ప్రతినిధి రావీష్‌ కూమార్‌ ట్విటర్‌లో తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి, శక్తి, రక్షణ మరియు పర్యాటక రంగం వంటి అంశాలపై లోతుగా చర్చించినట్లు పేర్కొన్నారు. గత మేలో సోచిలో భేటి అయిన ఇద్దరు నేతలు రష్యా, భారత్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కాగా ప్రపంచ జనాభాలో 40 శాతం ఉన్న బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు పరస్పర సహాకారం కొరకు 2009లో బ్రిక్స్‌ గా ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్రిక్స్‌ పదో శిఖరాగ్ర సమావేశాలకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ నగరం ఆతిథ్యం ఇస్తోంది.

మరిన్ని వార్తలు