రష్యా, భారత్‌ బంధాన్ని పక్షులతో పోల్చిన ప్రధాని

4 Sep, 2019 12:19 IST|Sakshi

మాస్కో : భారత్‌, రష్యాల మధ్య బంధం కేవలం కొన్ని రంగాలకు మాత్రమే పరిమితమైంది కాదని, చాలా అంశాల్లో ఇరుదేశాల మధ్య స్నేహం కొనసాగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యాకు చేరుకున్న ఆయన తూర్పు ప్రాంత నగరం వ్లాదివోస్తోక్‌కు వెళ్లారు. మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. తాజా పర్యటనతో రష్యాతో బంధానికి కొత్త ఉత్సాహం లభిస్తుందని అన్నారు. రష్యా నుంచి భారత్‌కు వచ్చే సైబీరియన్‌ పక్షులతో ఇరుదేశాల బంధాన్ని పోల్చారు. ఇరుదేశాలకు సైబీరియన్‌ పక్షులు పర్యాటక వారధులని పేర్కొన్నారు. వేల కిలోమీటర్లు ప్రయాణించి అవి భారత్‌కు చేరుకుంటాయని తెలిపారు. భారతీయులు చాలామంది తూర్పు ప్రాంతాలకు వెళ్లడం ఇష్టపడతారని, ఇది చాలా సహజబంధమని వ్యాఖ్యానించారు. 

‘న్యూఢిల్లీ, మాస్కోలు కలిసి తక్కువ ఖర్చుతో భారత్‌లో నాణ్యమైన ఆయుధాలను ఉత్పత్తి చేయాలి. సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అయితే భారతదేశంలో సైనిక పరికరాల ఉత్పత్తి చౌకగా మారుతుంది. మేము ఈ ఆయుధాలను మూడో దేశాలకు చాలా తక్కువ ధరలకు సరఫరా చేయగలుగుతాం. ఈ అవకాశాన్ని భారత్, రష్యా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది’అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నమానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ ప్రాజెక్టు కోసం వ్యోమగాముల శిక్షణకు రష్యా చేస్తున్న సాయాన్ని గుర్తుచేశారు.

‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భారతదేశంలో బాగా అభివృద్ధి చెందుతోంది. అంతరిక్ష రంగంలో విజయవంతంగా రాణిస్తున్నాం. గగన్‌యాన్‌ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాం. మా వ్యోమగాములకు శిక్షణనివ్వడానికి రష్యా సాయం చేస్తోంది. ఈ సహకారం కేవలం సైనిక, సాంకేతిక, అంతరిక్ష రంగాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది మరింత విస్తరిస్తుంది’ అని మోదీ చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు పులులంటే చాలా ఇష్టమని, అతనితో జరిగే ప్రతి సమావేశంలో వాటి సంరక్షణ ప్రస్తావన ఉంటుందని తెలిపారు. పుతిన్‌తో సమావేశమయ్యే ప్రతిసారి మా స్నేహం మరింత బలపడుతుంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. కాగా, మోదీ రష్యా అధ్యక్షుడితో కలిసి 20వ ఇండియా-రష్యా వార్షిక సదస్సు, అలాగే తూర్పుదేశాల ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు