భారత్‌–జపాన్‌.. గెలుపు జోడీ

28 Oct, 2018 04:34 IST|Sakshi
టోక్యోలో మోదీకి స్వాగతం పలుకుతున్న జపాన్‌ ఉన్నతాధికారులు

ఇరుదేశాల బంధంపై మోదీ

నేడు జపాన్‌లో ప్రధాని అబేతో ద్వైపాక్షిక భేటీ

న్యూఢిల్లీ: భారత్‌–జపాన్‌ ద్వైపాక్షిక వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జపాన్‌ చేరుకున్నారు. అంతకుముందు, మోదీ మాట్లాడుతూ భారత్, జపాన్‌లది గెలుపు జోడీ అని అభివర్ణించారు. ఆర్థిక, సాంకేతికాభివృద్ధిలో భారత్‌కు జపాన్‌ విశ్వసనీయమైన భాగస్వామి అని అన్నారు. టోక్యో విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆదివారం, సోమవారం జపాన్‌ ప్రధాని షింజో అబేతో మోదీ భేటీ అవుతారు. 2014లో ప్రధాని అయ్యాక మోదీ అబేతో సమావేశమవడం ఇది 13వ సారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలు రక్షణ, ప్రాంతీయ అనుసంధానత సహా పలు అంశాలపై చర్చలు జరిపే అవకాశాలున్నాయి.

ఇరు దేశాల సంబంధాల్లో పురోగతిని సమీక్షించి, వాటిని వ్యూహాత్మక కోణంలో బలోపేతం చేయడమే అజెండాగా ఈ సమావేశం జరుగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావీశ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. ఆదివారం నాటి షెడ్యూల్‌లో ఫ్యాక్టరీ ఆటోమేషన్‌లో అతిపెద్ద ఉత్పత్తిదారైన ఓ కంపెనీని మోదీ, అబే సందర్శిస్తారు. జపాన్‌ రాజధాని టోక్యోకు 110 కి.మీ.ల దూరంలోని యామాన్షి ప్రావిన్సులో ప్రకృతి సోయగాల మధ్య, ఆ దేశంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్‌ ఫుజి ఆవరించి ఉన్న తన విడిది గృహంలో అబే ప్రధాని మోదీకి రాత్రి ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఈ గౌరవం పొందబోతున్న తొలి విదేశీ నేత మోదీనే. విందు అనంతరం మోదీ, అబేలు రైలులో టోక్యో బయల్దేరుతారు. ఈ పర్యటనలో మోదీ టోక్యోలో అక్కడి భారత సంతతి ప్రజలతో ముచ్చటిస్తారు. కొన్ని వాణిజ్య వేదికలపై కూడా మోదీ ప్రసంగించనున్నారు.

6న కేదర్‌నాథ్‌కు..
వచ్చే నెల 6న మోదీ ఉత్తరాఖండ్‌లోని కేదర్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించే అవకాశాలున్నాయి. అలాగే, కేదర్‌పురి ఆలయ పునర్నిర్మాణ పనులను కూడా సమీక్షించే వీలుంది. అయితే ప్రధాని పర్యటనపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. కేదర్‌పురి ఆలయానికి మోదీ గతేడాది శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులను తరచూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్నారు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు