శ్రీలంకలోనూ చాయ్ మంత్రం.. మోదీ తంత్రం

12 May, 2017 16:14 IST|Sakshi
శ్రీలంకలోనూ చాయ్ మంత్రం.. మోదీ తంత్రం

శ్రీలంకలో ఉన్న తమిళులను ప్రసన్నం చేసుకోడానికి ప్రధాని నరేంద్రమోదీ తనకు బాగా అలవాటైన 'చాయ్' మంత్రాన్ని పఠించారు. అటు లంక తమిళులకు, ఇటు తనకు కూడా బాగా అలవాటైన టీ గురించి చెప్పి అక్కడి వారి మనసులు దోచుకున్నారు. రెండు రోజుల శ్రీలంక పర్యటనలో భాగంగా మోదీ అక్కడున్న తమిళులను కలిశారు. తనకు కూడా టీతో ప్రత్యేక అనుబంధం ఉన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుందని ఆయన అన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో తాను సాగించిన 'చాయ్‌పే చర్చా' కార్యక్రమాన్ని ఆయన గుర్తు చేశారు. తొలినాళ్లలో తాను రైల్వే స్టేషన్‌లో చాయ్ అమ్ముకున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. చాయ్‌పే చర్చా అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది ఆత్మగౌరవానికి ప్రతీక అని మోదీ శ్రీలంకలో చెప్పారు.

ప్రపంచం అంతటికి సిలోన్ చాయ్ అంటే ఏంటో బాగా తెలుసని, అది ఇక్కడి సారవంతమైన భూముల నుంచే వస్తుందని, ప్రపంచంలోనే శ్రీలంక మూడో అతిపెద్ద టీ ఎగుమతిదారుగా ఉందంటే, అది అక్కడి తమిళులు కష్టపడటం వల్లేనని మోదీ చెప్పడంతో ఒక్కసారిగా సమావేశ ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. తమిళ కథానాయకుడు, రాజకీయ దురంధరుడు ఎంజీ రామచంద్రన్‌తో పాటు తమిళ మూలాలున్న శ్రీలంక స్పిన్ మాస్టర్ ముత్తయ్య మురళీధరన్ గురించి కూడా మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించడంతో అక్కడకు హాజరైన వారు కేరింతలు కొట్టారు.

మరిన్ని వార్తలు