యువత అద్భుతాలు చేయగలదు

19 Aug, 2019 03:07 IST|Sakshi

భూటాన్‌ త్వరలోనే సొంత ఉపగ్రహం సమకూర్చుకోబోతోంది

‘రాయల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ భూటాన్‌’లో ప్రధాని మోదీ 

థింపూ: భవిష్యత్‌ తరాలపై ప్రభావం చూపగలరీతిలో అద్భుతాలు చేయగల శక్తిసామర్థ్యాలు భూటాన్‌ యువతలో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నైపుణ్యవంతులైన యువత భూటాన్‌ను సరికొత్త ఎత్తుకు తీసుకెళుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రపంచంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయనీ, ఈ సమస్యలకు పరిష్కారం కొనుగొనేందుకు మనకు తెలివైన యువతీయువకులు ఉన్నారని వెల్లడించారు. ఆలోచనలు, సృజనాత్మకతపై ఎలాంటి పరిమితులు విధించుకోవద్దని ప్రధాని సూచించారు. భూటాన్‌ పర్యటనలో భాగంగా ఆదివారం థింపూలోని ‘రాయల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ భూటాన్‌’లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మోదీ మాట్లాడారు. 

యువత లక్ష్యాన్ని గుర్తించాలి.. 
‘ప్రపంచం గతంలో ఎన్నడూలేనన్ని అవకాశాలను ఈరోజు ఇస్తోంది. సాంకేతిక ఆవిష్కరణలు, ఇతర రంగాల్లో భూటాన్‌ దూసుకుపోతే మీ 130 కోట్ల మంది స్నేహితులు మౌనంగా ఉండరు. ఆనందం, గర్వంతో చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తారు. ప్రస్తుతం భారత్‌ పలురంగాల్లో చరిత్రాత్మక రీతిలో పురోగమిస్తోంది. పాఠశాల స్థాయి నుంచి అంతరిక్షం, డిజిటల్‌ చెల్లింపులు, విపత్తుల నిర్వహణవరకూ భూటాన్‌తో కలిసి పనిచేసేందుకు మేం ఆసక్తిగా ఉన్నాం’ అని మోదీ పేర్కొన్నారు. 

‘అంతరిక్షం’లో సహకారం బలోపేతం.. 
అంతరిక్ష రంగంలోనూ భారత్‌ భూటాన్‌తో సంబంధాలను పటిష్టం చేసుకుంటోందని ప్రధాని మోదీ చెప్పారు. ‘మేం ‘థింపూ గ్రౌండ్‌ స్టేషన్‌ ఆఫ్‌ సౌత్‌ఏసియా శాటిలైట్‌’ను ప్రారంభించాం. ఉపగ్రహాలతో టెలిమెడిసిన్, దూరవిద్య, సహజవనరుల మ్యాపింగ్, వాతావరణాన్ని అంచనా వేయడంతో పాటు ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి హెచ్చరికలు జారీ చేయవచ్చు. మేం ఇటీవల చంద్రుడిపైకి చంద్రయాన్‌–2ను ప్రయో గించాం. భూటాన్‌ కూడా త్వరలోనే ఓ చిన్న ఉపగ్రహాన్ని సొంతంగా సమకూర్చుకోబోతోంది. భవిష్యత్‌లో భూటాన్‌కు చెందిన యువ శాస్త్రవేత్తలు భారత్‌కు వచ్చి తమ ఉపగ్రహాన్ని డిజైన్‌ చేసుకోవడంతో పాటు ప్రయోగాన్ని వీక్షిస్తారని ఆలోచిస్తేనే చాలా సంతోషంగా ఉంది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. తాను రాసిన ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ పుస్తకాన్ని భూటాన్‌ ప్రధాని లోటే షెరింగ్‌ ప్రశంసించడంపై స్పందిస్తూ, గౌతమబుద్ధుని ప్రభావంతోనే ఆ పుస్తకం రాసినట్లు మోదీ చెప్పారు. 

భూటాన్‌ అర్థం చేసుకుంది: సంతోషం ప్రాముఖ్యతను భూటాన్‌ అర్థం చేసుకుందని ప్రధాని మోదీ చెప్పారు. ‘భూటాన్‌ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలాఉంది. ఇక్కడ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సంస్కృతులు ఒకదానితో మరొకటి సంఘర్షణ పడకుండా కలిసి ముందుకు సాగుతాయి. సంతోషం యొక్క ప్రాముఖ్యతను, దయాగుణం గొప్పతనాన్ని భూటాన్‌ అర్థం చేసుకుంది’ అని మోదీ తెలిపారు. తర్వాత మోదీ భారత్‌కు తిరుగుపయనమయ్యారు.    

మరిన్ని వార్తలు