ఐసీయూలో బ్రిటన్‌ ప్రధాని 

8 Apr, 2020 03:30 IST|Sakshi

జాన్సన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందన్న ప్రధాని కార్యాలయం

అమెరికాలో మరణ మృదంగం

జపాన్‌లో ఎమర్జెన్సీ 

కరోనాతో బాధపడుతున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పరిస్థితి నిలకడగా ఉంది. లండన్‌ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌ సాయం అవసరం ఆయనకు లేదని ప్రధాని కార్యాలయం మంగళవారం వెల్లడించింది. జాన్సన్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆయనలో ఎలాంటి న్యుమోనియా లక్షణాలు కనిపించలేదని తెలిపింది. కాగా ‘ప్రధాని జాన్సన్‌.. మీరు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నా’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

లండన్‌/వాషింగ్టన్‌/టోక్యో: కరోనా వైరస్‌ మహమ్మారితో బాధపడుతున్న బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ పరిస్థితి నిలకడగా ఉంది. లండన్‌ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌ సాయం అవసరం ఆయనకు లేదని ప్రధాని కార్యాలయం మంగళవారం వెల్లడించింది. జాన్సన్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయనలో ఎలాంటి న్యుమోనియా లక్షణాలు కనిపించలేదని తెలిపింది. ‘‘ప్రధానమంత్రి జాన్సన్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రతీరోజూ ఆక్సిజన్‌ చికిత్స అందిస్తున్నామని, వెంటిలేటర్‌ పెట్టాల్సిన అవసరం లేదు’’డౌనింగ్‌ స్ట్రీట్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. లండన్‌లో సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో వైద్య నిపుణుల బృందం జాన్సన్‌కు చికిత్స అందిస్తున్నారని, జాన్సన్‌ చెప్పినట్టుగా ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని ఆయన వివరించారు.

జాన్సన్‌ కోలుకోవాలని సందేశాలు 
బోరిస్‌ జాన్సన్‌ కోలుకోవాలంటూ ప్రపంచ దేశాల నాయకులు సందేశాలు పంపారు. ‘‘ప్రధాని జాన్సన్‌. మీరు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నాను’అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. జాన్సన్‌ తనకు మంచి మిత్రుడని, ఆయన త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అమెరికా ప్రజలందరూ ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని చెప్పారు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో బోరిస్‌ జాన్సన్, ఆయన కుటుంబం, బ్రిటన్‌ ప్రజలందరి వెంట ఉంటామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రన్‌ చెప్పారు.

అమెరికాలో మరణ మృదంగం 
అగ్రరాజ్యం అమెరికాలో  మృతుల సంఖ్య 11 వేలకు, వ్యాధిగ్రస్తుల సంఖ్య 4 లక్షలకు చేరుకుంది. న్యూయార్క్‌లో అత్యధికంగా 5 వేల  కేసులు నమోదయ్యాయి.

జపాన్‌లో అత్యవసర పరిస్థితి 
జపాన్‌లో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో ప్రధానమంత్రి షింజో అబె నెల పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అన్నారు. సోమవారం ఒకే రోజు 100 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1200కి చేరుకుంది.  లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.

ఇటలీ, స్పెయిన్‌లలో పెరిగిన మృతులు  
ఇటలీ, స్పెయిన్‌లలో గత నాలుగైదు రోజులుగా తగ్గినట్టుగా అనిపించిన కోవిడ్‌–19 మృతుల సంఖ్య మళ్లీ ఎక్కువైంది. 24 గంటల్లో స్పెయిన్‌లో 743 మరణాలు నమోదైతే, ఫ్రాన్స్‌లో 833 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు: 13,94,710
మరణాలు: 79,384
కోలుకున్న వారు: 2,98,491

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా