ఇమ్రాన్‌కు మోదీ శుభాకాంక్షలు

23 Mar, 2019 04:08 IST|Sakshi

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ జాతీయ దినోత్సవం సందర్భంగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు భారత ప్రధాని  మోదీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. శనివారం (మార్చి 23) పాక్‌ జాతీయ దినోత్సవం. ఈ సందర్భంగా మోదీ పంపిన సందేశాన్ని ఇమ్రాన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఉగ్రవాదం, హింసల్లేని, ప్రజాస్వామ్య, శాంతియుత, వృద్ధిదాయకమైన భారత ఉపఖండం కోసం ఇరు దేశాల ప్రజలు కృషి చేయాలని మోదీ అన్నారు.

గత నెలలో పుల్వామాలో ఉగ్రవాద దాడి, అనంతరం పాక్‌లోని బాలాకోట్‌పై భారత వైమానిక దళం దాడి, ఆ మరుసటి రోజే పాక్‌ ప్రతీకార ప్రయత్నం తదితరాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌కు మోదీ శుభాకాంక్షలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మోదీ శుభాకాంక్షలు చెప్పడం నిజమో కాదో వెల్లడించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని కార్యాలయాన్ని కోరింది. అటు ఢిల్లీలోని పాక్‌ హై కమిషన్‌ కార్యాలయం జరిపే జాతీయ దినోత్సవ వేడుకలకు ఈసారి భారత్‌ హాజరవ్వడం లేదు. ఈ వేడుకలకు ప్రతీ ఏడాది భారత ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వెళ్లేవారు. ఈసారి వేడుకలకు కశ్మీరీ వేర్పాటువాదులను కూడా పిలవడంతో వెళ్లకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని వార్తలు