అంగారకుడిపై కూడు.. గూడు!

7 May, 2017 03:09 IST|Sakshi
అంగారక గ్రహంపై పంటలు పండించే గ్రీన్‌హౌస్‌

ఈ వ్యవహారమంతా.. ‘ఆలూ లేదు.. చూలూ లేదు.. ’ సామెతను గుర్తు చేస్తున్నా వివరాలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. భూమ్మీద మనుషులు నిండిపోతే.. ఎప్పుడో ఒకప్పుడు అంగారకుడి పైకి వెళ్లాల్సిందేనని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్న విషయం తెలిసిందే. నిన్నమొన్నటివరకూ అక్కడ నీరు కూడా లేదన్న సంశయముంటే ఇప్పుడు అదీ తీరిపోయింది. ఇక కావాల్సిందల్లా ఉండేందుకు ఇల్లు.. తినేందుకు తిండి. దీనికీ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. నిదర్శనం ఈ ఫొటోలే.

ఒకటేమో అంగారక గ్రహంపై పంటలు పండించేందుకు ఉద్దేశించిన గ్రీన్‌హౌస్‌ కాగా.. రెండోది త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ సాయంతో ఇళ్లు కట్టేసే యంత్రం. గ్రీన్‌హౌస్‌ విషయాన్ని ముందు చూద్దాం. దీన్ని అరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇతర గ్రహాలపై ఏడాది పొడవునా పంటలు పండించేందుకు ఈ గ్రీన్‌హౌస్‌ పనికొస్తుందని అంచనా. తక్కువ బరువు ఉంటూ.. అవసరమైనప్పుడు విశాలమైన గ్రీన్‌హౌస్‌గా విచ్చుకోవడం దీనికున్న ప్రత్యేక లక్షణం. వ్యోమగాములు విడిచిపెట్టే కార్బన్‌డైయాక్సైడ్‌ను మొక్కల పెంపకానికి వాడటం, గ్రీన్‌హౌస్‌లో ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను వ్యోమగాములు పీల్చుకునేందుకు అందించడం ఇంకో విశేషం. పరిసరాల్లోని వాతావరణాన్ని బట్టి అక్కడికక్కడే నీటిని తయారు చేసి.. మొక్కల వేళ్లకు అందించేందుకు, వాటిలోకి తగు మోతాదులో పోషకాలను చేర్చేందుకూ ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి.

ఇక రెండో ఫొటో. అమెరికాలోని మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తయారు చేసిన లేటెస్ట్‌ త్రీడీ ప్రింటర్‌ ఇది. ఒకపక్క నుంచి చుట్టూ ఉన్న మట్టిని సేకరించడం.. దాన్ని కొన్ని రసాయనాలు, సిమెంట్‌ లాంటి పదార్థాలతో కలిపేందుకు ఏర్పాట్లు ఉండగా... ఇంకోవైపున ఇలా తయారైన పదార్థాన్ని నిర్దిష్ట ఆకారంలో పేర్చేసి ఇంటికి ఓ రూపమివ్వగల పరికరాలు ఉన్నాయి దీంట్లో. ఈ మధ్యే ఈ యంత్రం సాయంతో ఎంఐటీ దాదాపు 12 అడుగుల వెడల్పయిన డోమ్‌ను కేవలం 14 గంటల్లో కట్టేసింది. ఇంకో విషయం.. ఎప్పుడో ఇతర గ్రహాల్లో ఇళ్లు కట్టేందుకు మాత్రమే ఇది ఉపయోగపడదు. భూమ్మీద కూడా నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు కూడా పనికొస్తుంది ఈ త్రీడీ యంత్రం.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు