ఎట్టకేలకు ‘విక్రమ్‌’ గుర్తింపు

4 Dec, 2019 02:52 IST|Sakshi

చెన్నై యువ ఇంజనీర్‌ సాయంతో ల్యాండర్‌ శకలాలను గుర్తించిన నాసా

వాషింగ్టన్‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి ఉపరితలం మీదకు సెప్టెంబర్‌ 7న ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ జాడలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎట్టకేలకు గుర్తించింది. అయితే ఈ ఘనత పూర్తిగా తమదేమీ కాదని, చెన్నై యువ ఇంజనీర్‌ షణ్ముగ సుబ్రమణియన్‌ సాయపడటంతో విక్రమ్‌ పడిన ప్రాంతాన్ని, శకలాలను గుర్తించగలిగామని నాసా ప్రకటించింది. ఈ మేరకు నాసా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ ఏడాది జూలై 22న శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్‌–2 నింగికి ఎగిరిన విషయం మనకు తెలిసిందే. నెలల ప్రయాణం తర్వాత సెప్టెంబర్‌లో జాబిల్లి కక్ష్యలోకి చేరిన చంద్రయాన్‌–2 నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ వేరుపడి నెమ్మదిగా చంద్రుడి ఉపరితలం వైపు ప్రయాణించింది. అయితే సెప్టెంబర్‌ 7న చివరిక్షణంలో విక్రమ్‌ ల్యాండర్‌తో సమాచార సంబంధాలు తెగిపోయాయి. నెమ్మదిగా ల్యాండ్‌ అవడానికి బదులు కొంత ఎత్తు నుండి కుప్ప కూలిపోయినట్లు నాసా నిర్థారించింది. చంద్రయాన్‌ –2 విక్రమ్‌ ల్యాండర్‌ను నాసా అంతరిక్ష నౌక లూనార్‌ రికానిసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌ఓ) గుర్తించిందని, వివరాల కోసం ఫొటోలు చూడాల్సిందిగా నాసా మంగళవారం ఒక ట్వీట్‌ చేసింది. విక్రమ్‌ ల్యాండర్‌ కూలిపోయిన పదిరోజులకు అంటే సెప్టెంబర్‌ 17న ఎల్‌ఆర్‌ఓ తీసిన కొన్ని ఛాయాచిత్రాలను నాసా విడుదల చేసింది. సెప్టెంబర్‌ 26న విడుదల చేసిన ఈ ఫొటోలను అదే ప్రాంతపు ఇతర ఫొటోలతో పోల్చి చూసి ల్యాండర్‌ జాడలను గుర్తించాలని నాసా ప్రజలను ఆహ్వానించింది. ఇందుకు స్పందించిన చెన్నై మెకానికల్‌ ఇంజనీర్‌ షణ్ముగ సుబ్రమణియన్‌ (33) తన ప్రయత్నం చేశారు.

ఎట్టకేలకు విక్రమ్‌ కూలిన ప్రాంతాన్ని, శకలాలను కనుగొన్నారు. అక్టోబర్‌ 3న నాసా, ఎల్‌ఆర్‌వో, ఇస్రో ట్విట్టర్‌ హ్యాండిళ్లను ట్యాగ్‌ చేసిన షణ్ముగ కొన్ని ఫొటోలను జత చేస్తూ ‘విక్రమ్‌ ల్యాండర్‌ ఇదేనా (ల్యాండింగ్‌ ప్రాంతానికి కిలోమీటర్‌ దూరం)?.. జాబిల్లి మట్టిలో కూరుకుపోయిందా?’ అంటూ ఓ ట్వీట్‌ చేశారు. ‘విక్రమ్‌ ల్యాండర్‌ కూలిన ప్రాంతమిదే కావచ్చు. శకలాలు ఇక్కడే పడి ఉండవచ్చు’ అంటూ మరికొన్ని వివరాలు, ఫొటోలను జత చేసి నవంబర్‌ 17న మరో ట్వీట్‌ చేశాడు.

750 మీటర్ల దూరంలో...
షణ్ముగ ముందు విక్రమ్‌ కుప్పకూలిందన్న ప్రాంతానికి వాయవ్య దిశలో 750 మీటర్ల దూరంలో శకలాలను గుర్తించాడని, భారీ ఫొటోలో ఈ శకలం ప్రకాశవంతమైన పిక్సెల్‌గా కనిపించిందని నాసా వివరించింది. షణ్ముగ ఈ సమాచారాన్ని నాసాకు అందించడంతో ఎల్‌ఆర్‌ఓ కెమెరా సిబ్బంది ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టడం మొదలుపెట్టి శకలాల గుర్తింపులో విజయం సాధించింది. షణ్ముగ సమాచారం ఇచ్చిన తరువాత ఎల్‌ఆర్‌ఓ అక్టోబర్‌ 14, 15, నవంబర్‌ 11 తేదీల్లో ఆ ప్రాంతాన్ని మళ్లీ ఫొటోలు తీసిందని తెలిపింది. ఈ కొత్త పరిశీలనల ద్వారా విక్రమ్‌ ల్యాండర్‌ ముందుగా నిర్ణయించిన సాఫ్ట్‌ల్యాండింగ్‌ ప్రాంతం నుంచి ఆగ్నేయంగా సుమారు 2,500 అడుగుల దూరంలో కూలిందని, శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయని నాసా తెలిపింది. విక్రమ్‌ ల్యాండర్‌ శకలాలను గుర్తించారని ధ్రువీకరించిన నాసా ఇందుకు సంబంధించి షణ్ముగకు కృతజ్ఞతలు తెలిపింది. సమాచారమిచ్చినందుకు ధన్యవాదాలని ఎల్‌ఆర్‌ఓ ప్రాజెక్టు డిప్యూటీ, సైంటిస్ట్‌ అయిన జాన్‌ కెల్లెర్‌ మంగళవారం ఒక ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు