కనిపించని ‘విక్రమ్‌’

24 Oct, 2019 03:28 IST|Sakshi

నాసా తాజా ఫొటోల్లో దొరకని ఆచూకీ

వాషింగ్టన్‌: చంద్రయాన్‌–2లో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవంపైకి ఇస్రో పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీ లభించలేదు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన చంద్రుడి ఆర్బిటర్‌ తాజాగా తీసిన ఫొటోల్లో విక్రమ్‌ జాడలేదు. సెప్టెంబర్‌ 7న విక్రమ్‌ ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసేందుకు ప్రయత్నించగా భూమితో సంబంధాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కూడా దాన్ని వెతికేందుకు అన్వేషిస్తూనే ఉన్నారు. ఇందుకోసం నాసా కూడా ఇస్రోకు సాయం చేస్తోంది. ఇందులో భాగంగా నాసాకు చెందిన ‘లూనార్‌ రీకనోయిసెన్స్‌ ఆర్బిటర్‌’అక్టోబర్‌ 14న చంద్రుడి దక్షిణ ధృవం ఫొటోలను తీసింది. ఆ ఫొటోల్లో ఎక్కడ కూడా విక్రమ్‌ జాడ కన్పించలేదని నాసాకు చెందిన శాస్త్రవేత్త ఎడ్వర్డ్‌ పెట్రో స్పష్టం చేశారు. కెమెరా బృందం చాలా క్షుణ్నంగా ఫొటోలన్నీ గమనించారని, అయినా కూడా గుర్తించలేకపోయారని వెల్లడించారు. ‘చంద్రుడి నీడ ప్రాంతంలో కానీ, మేం వెతికిన ప్రాంతానికి వెలుపల ఉండే అవకాశం ఉంది’అని వివరించారు.

మరిన్ని వార్తలు