అరుణగ్రహంపై జీవం కోసం...

29 Dec, 2019 04:31 IST|Sakshi

 ‘ది మార్స్‌ 2020 మిషన్‌’ ఆవిష్కరణ

వచ్చే ఏడాది జూన్‌లో మార్స్‌పైకి దూసుకుపోనున్న రోవర్‌

పాసడీనా (అమెరికా): వచ్చే ఏడాది అరుణగ్రహంపైకి పంపనున్న ‘ది మార్స్‌ 2020 మిషన్‌’అంతరిక్ష నౌక (రోవర్‌) ద్వారా నాసా ఆ గ్రహంపై ఇప్పటివరకు ఏమైనా జీవం ఉందా అన్న అంశాన్ని పరిశోధించనుంది. అంతేకాదు భవిష్యత్తులో మానవుని మనుగడ సాధ్యమవుతుందా అనేది కూడా తెలుసుకోనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అరుణగ్రహంపైకి పంపనున్న అంతరిక్ష నౌకను శుక్రవారం శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌ పాసడీనాలో ఉన్న జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీలో ఈ నౌకను శాస్త్రవేత్తలు రూపొందించారు.

గత వారమే ఈ నౌకను విజయవంతంగా పరీక్షించారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో శాస్త్రవేత్తలు ఈ అంతరిక్ష నౌకను తొలిసారిగా ప్రపంచానికి చూపించారు. ఈ నౌక 2020 జూలైలో ఫ్లోరిడాలోని కేప్‌ కెనవరెల్‌ నుంచి అంతరిక్షంలోకి దూసుకుపోయి 2021 ఫిబ్రవరిలో అరుణగ్రహంపై ల్యాండ్‌ కానుంది. ఈ రోవర్‌పై 23 కెమెరాలు, మార్స్‌పై గాలి శబ్దాలు వినేందుకు రెండు రిసీవర్లు, రసాయనిక చర్యలను విశ్లేషించేందుకు లేజర్లను వాడినట్లు డిప్యూటీ మిషన్‌ లీడర్‌ మట్‌ వాలేస్‌ తెలిపారు. క్యూరియాసిటీ రోవర్‌ మాదిరిగానే 6 చక్రాలను అమర్చారు.

ఈ రోవర్‌ దాదాపు కారు పరిమాణంలో ఉంటుంది. అక్కడి ఒక్క రోజులో పూర్తిస్థాయిలో 200 గజాల స్థలాన్ని తూర్పారా పట్టే పనిని రోవర్‌కు అప్పగించారు.  దీనికి చేతులు, నేలను తవ్వేందుకు డ్రిల్‌ అమర్చారు. ఒకప్పుడు అరుణగ్రహంపై వెచ్చటి ఉపరితల జలం, చిక్కటి వాతావరణం, దీని చుట్టూ అయస్కాంత శక్తి ఉండేదని వివరించారు. దీన్ని బట్టి ఏకకణ జీవం ఉండేదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. రోవర్‌ దిగే స్థలంపై పరిశోధన చేశాక ఎంపికచేశారు. ఈ స్థలంలో ఒకప్పుడు సరస్సు ఉండేదని తెలిపారు. 350 కోట్ల ఏళ్ల ఇది నదీ వ్యవస్థతో అనుసంధానమై ఉండొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ఈ రోవర్‌ ప్రయోగం తర్వాత ప్రతిష్టాత్మకమైన అరుణగ్రహంపైకి మానవసహిత అంతరిక్ష నౌకను పంపనున్నారు.
అరుణ గ్రహంపై పరిశోధనలు చేయనున్న రోవర్‌ ఇదే

మరిన్ని వార్తలు